ధన్‌తేరాస్‌కు రూ. 19,500 కోట్ల విలువైన బంగారం అమ్మకాలు!

by Disha Web Desk 17 |
ధన్‌తేరాస్‌కు రూ. 19,500 కోట్ల విలువైన బంగారం అమ్మకాలు!
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది ధన త్రయోదశికి రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బంగారం అమ్మకాలు జరిగాయని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(ఐబీజేఏ) తాజా ప్రకటనలో తెలిపింది. రెండు రోజుల పాటున జరిగిన ధన్‌తేరాస్ సందర్భంగా మొత్తం 39 టన్నుల బంగారం విక్రయించబడగా, వాటి విలువ రూ. 19,500 కోట్లని ఐబీజేఏ వెల్లడించింది.

గతేడాది ఇదే సందర్భంగా దేశంలో 30 టన్నుల బంగారం అమ్మకాలు జరగ్గా, 30 శాతం వృద్ధి నమోదైంది. రెండు రోజుల ధన్‌తేరాస్ సమయంలో పన్ను మినహాయించి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 50,139 వద్ద ఉంది. గత ఏడాది ఇదే సమయంలో 10 గ్రాముల పసిడి రూ. 47,644గా ఉంది.

అక్టోబర్ 23, ఆదివారం రోజు భారత్-పాక్ మ్యాచ్ కారణంగా ఆభరణాల మార్కెట్ కొద్దిసేపు నిలిపోయింది. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత జ్యువెలరీ స్టోర్లలో వినియోగదారులు పెరిగారని, కొనుగోళు కార్యకలాపాలు పుంజుకున్నాయని ఆలిండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఛైర్మన్ ఆశిష్ పేథె అన్నారు.

ఈ ఏడాది కొనుగోళ్లలో దాదాపు 80 శాతం ఆభరణాలే ఉన్నాయి. దీన్ని బట్టి వినియోగం ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుందని పీఎన్‌జీ జ్యువెలర్స్ ఎండీ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. ఎక్కువ మంది కస్టమర్లు డిజిటల్ చెల్లింపులు చేశారని ఆయన పేర్కొన్నారు. దక్షిణ భారత్‌లో అత్యధికంగా సాదా బంగారు ఆభరణాలకు గిరాకీ పెరిగిందని ఐబీజేఏ వెల్లడించింది.



Next Story

Most Viewed