వరుసగా మూడో రోజూ బలహీనపడ్డ మార్కెట్లు!

by Disha Web Desk 17 |
వరుసగా మూడో రోజూ బలహీనపడ్డ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. గురువారం ట్రేడింగ్‌లో సూచీలు మరోసారి గరిష్ఠాల వద్ద అమ్మకాల కారణంగా వరుసగా మూడో రోజూ బలహీనపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలకు తోడు దేశీయంగా రియల్టీ, ఎనర్జీ రంగాల్లో మదుపర్లు షేర్ల అమ్మకాలకు మొగ్గుచూపారు. మరోవైపు మార్చి త్రైమాసికానికి సంబంధించి ఇటీవల వెలువడిన ఫలితాలు నిరాశపరచడంతో పాటు కీలక కంపెనీల షేర్లు పెద్ద ఎత్తున అమ్ముడవడం మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 128.90 పాయింట్లు నష్టపోయి 61,431 వద్ద, నిఫ్టీ 51.80 పాయింట్లు కోల్పోయి 18,129 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్ రంగాల్లో అమ్మకాలు పోటెత్తాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఎస్‌బీఐ, ఐటీసీ, టైటాన్, ఎంఅండ్ఎం, పవర్‌గ్రిడ్, ఎల్అండ్‌టీ, టాటా మోటార్స్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.57 వద్ద ఉంది.


Next Story

Most Viewed