భారత ఎగుమతులకు భౌగోళిక రాజకీయ ఎఫెక్ట్

by Disha Web Desk 17 |
భారత ఎగుమతులకు భౌగోళిక రాజకీయ ఎఫెక్ట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంతో 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి యూరప్, అమెరికా వంటి దేశాలకు ఎగుమతులు ప్లాట్‌గా ఉన్నాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారిక డేటా ప్రకారం, ఏడాది ప్రాతిపదికన ఇవి 2.4 శాతం తగ్గాయి. ముఖ్యంగా అమెరికాకు 1 శాతం తగ్గగా, యూరప్‌కు ఎగుమతులు స్వల్పంగా 1.47 శాతం మాత్రమే పెరిగాయి. యూరప్‌కు భారత్ నుంచి ఎగుమతుల విలువ 2022లో $85.20 బిలియన్లుగా నమోదుకాగా, 2023లో $97.45 బిలియన్లకు, 2024లో $98.88 బిలియన్లకు పెరిగింది. ఐరోపాకు ప్రధాన వాణిజ్య మార్గం అయిన ఎర్ర సముద్రం ప్రాంతంలో సైనిక ఘర్షణలు కూడా ఎగుమతులు తగ్గేలా చేశాయి.

యూరప్‌ తరువాత రెండవ అతిపెద్ద ఎగుమతి మార్కెట్ అయిన అమెరికాకు భారత ఎగుమతులు 2023లో $78.31 బిలియన్ల నుండి 2024లో $77.52 బిలియన్లకు పడిపోయాయి. రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువులు, రెడీమేడ్ వస్త్రాలు, సేంద్రియ, అకర్బన రసాయనాలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు క్షీణించగా, మందులు, ఫార్మాస్యూటికల్, పెట్రోలియం ఉత్పత్తులు స్వల్పంగా పెరిగాయి.

మొత్తంగా ప్రపంచదేశాలకు భారతదేశ సరుకుల ఎగుమతులు $437.06 బిలియన్లుగా ఉన్నాయి, ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో $451.07 బిలియన్లగా ఉంది. అదే కాలంలో వస్తువుల దిగుమతులు $715.97 బిలియన్ల నుండి $677.24 బిలియన్లకు పడిపోయాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఎర్ర సముద్రం ప్రతిష్టంభన, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు 2024లో భారతదేశ వాణిజ్య పనితీరును ప్రభావితం చేశాయి.

Next Story

Most Viewed