భారత్‌లో ఎలాన్‌మస్క్ పర్యటన వాయిదా

by Disha Web Desk 17 |
భారత్‌లో ఎలాన్‌మస్క్ పర్యటన వాయిదా
X

దిశ, బిజినెస్ బ్యూరో: టెస్లా అధినేత ఎలాన్‌మస్క్ ఈ నెలలో భారత్‌లో పర్యటించాల్సి ఉండగా, అది ప్రస్తుతం వాయిదా పడింది. ఈ విషయాన్ని మస్క్ తన సోషల్ మీడియా ఎక్స్‌లో వెల్లడించారు. అతి ముఖ్యమైన పనులు ఉండటం వలన ఈ పర్యటనను వాయిదా వేయాల్సి వచ్చిందని, ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో పర్యటించాలనుకుంటున్నానని అన్నారు. భారత్‌లో పెట్టుబడులకు సంబంధించి విద్యుత్ కార్ల ప్లాంట్ ఏర్పాటు కోసం ఏప్రిల్ 21,22 తేదీల్లో మస్క్ పర్యటించాల్సి ఉంది. ముఖ్యంగా ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉండగా, ఇప్పుడు అది కాస్త వాయిదా పడింది.

భారత్‌లో అడుగుపెట్టాలని గత కొంత కాలంగా కేంద్రంతో టెస్లా చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. తమ విద్యుత్ కార్ల విషయంలో రాయితీ ఇవ్వాలని కంపెనీ కోరుకుంటుండగా, దీనికి భారత్ ఒప్పుకోకపోవడంతో ఇంతకాలం ఈ ప్రతిపాదన ముందుకు వెళ్లలేదు. అయితే ఇటీవల కేంద్రం కొత్త ఈవీ పాలసీని తీసుకురావడంతో టెస్లా భారత్‌లో అడుగుపెట్టడానికి అవకాశం లభించింది. దీంతో కంపెనీ భారత్‌లో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధం అయింది. ప్రస్తుతం టెస్లా అధికారులు భారత్‌లో తమ ప్లాంట్ కోసం సరిపడా స్థలాన్ని ఎంచుకునే పనిలో ఉన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు టెస్లా అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వారికి అనువైన స్థలం దొరకగానే ప్లాంట్ పనులు మొదలయ్యే అవకాశం ఉంది.



Next Story

Most Viewed