బైజూస్ సీఈఓ ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

by Disha Web Desk 17 |
బైజూస్ సీఈఓ ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు
X

బెంగళూరు: ప్రముఖ ఎడ్‌‌టెక్ కంపెనీ బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్, ఆయన కంపెనీ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం సోదాలు నిర్వహించింది. బెంగళూరులోని మూడు ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనలకు విరుద్ధంగా కంపెనీ పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అందుకున్నట్లు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. సోదాలలో భాగంగా డిజిటల్ డేటా, డాక్యు‌మెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఆన్‌లైన్ విధానంలో ఎడ్యుకేషన్ కోర్స్‌లను అందిస్తున్న బైజూస్ 2011-2023 మధ్య కాలంలో రూ. 28,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అందుకుందని ఈడీ తన విచారణలో పేర్కొంది. అలాగే, కంపెనీ దాదాపు రూ. 9,754 కోట్ల నిధులను పలు విదేశీ సంస్థలకు పంపిందని, ఇవన్నీ కూడా ఫెమా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఈడీ ప్రధాన ఆరోపణ. దీని గురించి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వచ్చి ఫిర్యాదు ఆధారంగా ఈడీ దర్యాప్తు మొదలు పెట్టింది.

దీని గురించి బైజూస్ సీఈఓ రవీంద్రన్‌కు చాలా సార్లు నోటిసులు జారీ చేసినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సోదాలు చేసినట్లు ఈడీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి కంపెనీ తన ఆర్థిక నివేదికలను సిద్ధం చేయలేదు, ఖాతాలను ఆడిట్ చేయలేదని ఈడీ తెలిపింది. ఈ సోదాలపై స్పందించిన బైజూస్, అధికారులకు పూర్తిగా సహకరిస్తామని, వారు అడిగిన సమాచారాన్ని అందించినట్లు తెలిపారు.

2011లో ప్రారంభించిన బైజూస్ ఆన్‌లైన్ విధానంలో దేశవ్యాప్తంగా పలు కోర్స్‌లను అందిస్తుంది. కరోనావైరస్ మహమ్మారి సమయంలో భారీగా వృద్ధి చెందింది. అయితే, మహమ్మారి తగ్గాక పాఠశాలలు తిరిగి ప్రారంభం అవడం తో దాని ఆదాయంలో భారీ క్షిణతను చూస్తోంది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2023 ప్రకారం, బైజు రవీంద్రన్ ప్రపంచ విద్యా రంగంలో రెండవ అత్యంత సంపన్న వ్యాపారవేత్త. అతని నికర విలువ $3.3 బిలియన్లుగా ఉంది.


Next Story

Most Viewed