1,400 మంది ఉద్యోగులను తొలగించిన స్పైస్‌జెట్

by Dishanational1 |
1,400 మంది ఉద్యోగులను తొలగించిన స్పైస్‌జెట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఎయిర్‌లైన్స్ తన మొత్తం సిబ్బందిలో దాదాపు 15 శాతానికి సమానమైన 1,400 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు వెల్లడించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న కారణంగా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పొందేందుకు, ఖర్చులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. స్పైస్‌జెట్‌లో ప్రస్తుతం 9,000 మంది ఉద్యోగులు ఉన్నారు. సుమారు 30 విమానాలను నడుపుతోంది. ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలే రూ. 60 కోట్ల వరకు అవుతోంది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న సంస్థకు జీతాల ఖర్చు భారంగా మారడంతో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది. ఇప్పటికే గత కొన్ని నెలల నుంచి స్పైస్‌జెట్ ఉద్యోగుల జీతాలను పెండింగ్‌లో ఉంచినట్టు తెలుస్తోంది. పెండింగ్ వేతనాలతో పాటు ఇతర అవసరాల కోసం సంస్థ రూ. 2,200 కోట్ల వరకు నిధులను సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. నగదు కొరత సమస్య వల్ల పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో నిధులు లభించడం కష్టంగా మారింది. అయినప్పటికీ కొంత ఆలస్యమైనా నిధులు లభిస్తాయని స్పైస్‌జెట్ ఆశాజనకంగా ఉంది.


Next Story

Most Viewed