లోన్ తీసుకున్నారా.. అయితే ఇక బాదుడే అంటున్న Canara Bank!

by Disha Web Desk 17 |
లోన్ తీసుకున్నారా.. అయితే ఇక బాదుడే అంటున్న Canara Bank!
X

ముంబై: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు మంగళవారం తన మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌(ఎంసీఎల్ఆర్) రేటును పెంచుతున్నట్టు ప్రకటించింది. దీనివల్ల బ్యాంకులో వివిధ రుణాలు తీసుకున్న వినియోగదారులకు నెలవారీ వాయిదాలపై భారం పడనుంది. వివిధ కాలవ్యవధులపై ఎంసీఎల్ఆర్ రేటు 15 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు, పెంచిన రేట్లు బుధవారం(సెప్టెంబర్ 7) నుంచి అమల్లోకి రానున్నట్టు కెనరా బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

దీంతో ముఖ్యంగా వ్యక్తిగత, గృహ, వాహన రుణాలపై ప్రభావం చూపే ఏడాది కాలవ్యవధిపై ఎంసీఎల్ఆర్ రేటు 0.15 శాతం పెరగడం వల్ల 7.75 శాతానికి చేరుకుంది. ఎక్కువ రుణాలు ఏడాది కాలపరిమితికి అనుసంధానించబడి ఉంటాయని బ్యాంకు ఓ ప్రకటనలో పేర్కొంది. మిగిలిన కాలవ్యవధుల్లో ఓవర్‌నైట్, నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 0.10 శాతం చొప్పున పెంచింది. మూడు నెలల కాలవ్యవధిపై 0.15 శాతం పెంచడంతో 7.25 శాతానికి చేరుకుంది.

కాగా, గత నెలలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కీలక రేపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఆర్‌బీఐ పెంపు నిర్ణయం తీసుకోవడంతో రెపో రేటు 5.40 శాతానికి చేరుకుంది. దీనికి అనుగుణంగా ఇప్పటికే పలు బ్యాంకులు తమ రుణ రేట్లను పెంచాయి.

Next Story

Most Viewed