అదానీ స్టాక్స్‌కు మరో బ్యాడ్‌న్యూస్

by Dishanational1 |
అదానీ స్టాక్స్‌కు మరో బ్యాడ్‌న్యూస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: బిలీయనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ స్టాక్స్ మరోసారి ఆరోపణల కారణంగా పతనమయ్యాయి. లంచం ఆరోపణలతో అదానీ గ్రూప్‌పై అమెరికా ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించిందనే వార్తల నేపథ్యంలో 10 అదానీ కంపెనీ షేర్లు డీలాపడ్డాయి. సోమవారం మార్కెట్లలో ట్రేడింగ్ మొదలైన వెంటనే అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ 4 శాతానికి పైగా క్షీణించింది. మిడ్-సెషన్ సమయానికి కోంత కోలుకున్నప్పటికీ అమ్మకాల ఒత్తిడి అధికంగా కనిపించింది. అదానీ పోర్ట్స్ అండ్ ఎకనమిక్ జోన్ షేర్ తొలుత 3 శాతానికి పైగా దెబ్బతినగా, ఆ తర్వాత కోలుకుని 1.2 శాతం మేర నష్టంతో ర్యాలీ అవుతోంది. మిగిలిన అదానీ స్టాక్స్ సైతం బలహీన ర్యాలీని కొనసాగిస్తున్నాయి. ఇదే సమయంలో అదానీ గ్రూపునకు చెందిన డాలర్ బాండ్ల విలువ కూడా క్షీణించింది. భారత్‌లో ఇంధన ప్రాజెక్టుల ప్రక్రియ అనుకూలంగా జరిగేందుకు అదానీ గ్రూప్ లేదా గౌతమ్ అదానీ, ఇంకా ఎవరైనా లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారా? అనే అంశంపై అమెరికా ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించినట్టు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. అమెరికా అటార్నీ జనరల్ ఆఫీస్, జస్టిస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన యూనిట్ ఈ విషయంపై విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. అదానీ గ్రూప్ అమెరికా మార్కెట్లలో ట్రేడింగ్ నిర్వహించనప్పటికీ, అమెరికాకు చెందిన పెట్టుబడులు అదానీ గ్రూప్ షేర్లలో ఉన్న కారణంగా దర్యాప్తు చేసేందుకు వీలుంటుంది. అయితే, ఈ వ్యవహారం గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది.


Next Story

Most Viewed