మిడిల్ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. ఎయిర్‌ఇండియా కీలక నిర్ణయం

by Disha Web Desk 17 |
మిడిల్ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. ఎయిర్‌ఇండియా కీలక నిర్ణయం
X

దిశ, బిజినెస్ బ్యూరో: మిడిల్ఈస్ట్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ డ్రోన్లు, క్షీపణులతో ఇజ్రాయెల్‌‌పై ఏ క్షణామైన దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ఇరాన్ గగనతల మీదుగా ఎయిర్‌ఇండియా తన విమాన రాకపోకలను నిలిపివేసింది. ఢిల్లీ నుండి తెల్లవారుజామున 4.30 గంటలకు బయలుదేరిన ఎయిర్ ఇండియా AI 161 విమానం ఇరాన్‌ మీదుగా కాకుండా ప్రత్యామ్నాయ మార్గంలో లండన్‌కు వెళ్లింది.

ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది, కాబట్టి ప్రజలు ఈ ప్రాంతాలకు తమ ప్రయాణాలను రద్దు/వాయిదా వేసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారతీయ పౌరులకు సలహా ఇచ్చిన ఒక రోజు తర్వాత ఎయిర్‌ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఐరోపాకు ప్రయాణించడానికి ప్రజలు సుదీర్ఘ మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. భారత్‌తో పాటు ఇతర దేశాల విమాన సంస్థలు కూడా ఇరాన్ మీదుగా తమ విమాన ప్రయాణాలు రద్దు చేస్తున్నాయి.దీంతో ఐరోపాకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఇజ్రాయిల్-హమాస్ మధ్య గత కొన్ని నెలలుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1న సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ దౌత్య భవనాన్ని ఇజ్రాయెల్ నేలమట్టం చేసిన తర్వాత ఇరాన్ దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై దాడి చేస్తామని హెచ్చరించింది. దీంతో ఈ యుద్ధం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపడంతో పాటు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దాడిని ఎలాగైన ఆపాలని ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముందస్తుగా పలు దేశాలు తమ పౌరులు ఇజ్రాయెల్, ఇరాన్ నుంచి వెళ్లిపోవాలని సూచిస్తున్నాయి. అలాగే విమాన సంస్థలు కూడా తమ విమానాలను ఆ దేశాల మీదుగా ప్రయాణించకుండా చూస్తున్నాయి.

Next Story

Most Viewed