80 ఏళ్ల వ్యక్తి మరణించిన ఘటనలో ఎయిర్ఇండియాకు డీజీసీఏ భారీ జరిమానా

by Dishanational1 |
80 ఏళ్ల వ్యక్తి మరణించిన ఘటనలో ఎయిర్ఇండియాకు డీజీసీఏ భారీ జరిమానా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) భారీ జరిమానా విధించింది. వీల్‌చైర్ కొరత కారణంగా విమానం నుంచి టెర్మినల్ బిల్డింగ్ వరకు నడవడంతో 80 ఏళ్ల వ్యక్తి మరణించిన ఘటనలో ఎయిర్ఇండియాకు రూ. 30 లక్షల ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 12న భారత సంతతికి చెందిన వృద్ధి ప్రయాణీకులు తన భార్యతో కలిసి ఎయిర్ఇండియా విమానంలో న్యూయార్క్ నుంచి ముంబైకి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించి సదరు ఉద్యోగులపై ఎయిర్‌లైన్ తీసుకున్న చర్య గురించి స్పష్టత లేకపోవడం, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకున్న దిద్దుబాటు చర్యల గురించి చెప్పడంలో ఎయిర్ఇండియా విఫలం కావడంతో జరిమానా విధించినట్టు ఓ అధికారి తెలిపారు.

వైకల్యం ఉన్న వ్యక్తులకు సంబంధించి ఉన్న నిబంధనలను పాటించడంలో ఎయిర్ఇండియా వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ వచ్చిన ఫిర్యాదులు, వార్తలను అనుసరించి డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. జరిమానాతో పాటు విమానం ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు సహాయం అవసరమైన ప్రయాణీకులకు తగిన సంఖ్యలో వీల్‌చైర్‌లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించింది. ఇక, ఈ వ్యవహారంలో ప్రయాణికుడి మరణంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా విచారణ చేపట్టింది. నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కోరుతూ డీజీసీఏకు నోటీసులిచ్చింది.

Next Story

Most Viewed