2030 నాటికి సిమెంట్ తయారీని రెట్టింపు చేయడమే లక్ష్యం: గౌతమ్ అదానీ!

by Disha Web Desk 16 |
2030 నాటికి సిమెంట్ తయారీని రెట్టింపు చేయడమే లక్ష్యం: గౌతమ్ అదానీ!
X

న్యూఢిల్లీ: దేశీయ సిమెంట్ పరిశ్రమలో అడుగుపెట్టిన అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీ ఈ రంగంలో మరింత దూకుడుగా వ్యవహరించనున్నట్టు ప్రకటించారు. గతవారం అంబుజా, ఏసీ సిమెంట్ కంపెనీల కొనుగోలును పూర్తి చేసిన నేపథ్యంలో సోమవారం గౌతమ్ అదానీ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. ఇందులో భాగంగా 2030 నాటికి కంపెనీల సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. ప్రస్తుతం ఏడాదికి 70 మిలియన్ టన్నుల సామర్థ్యం, వచ్చే ఐదేళ్లలో 140 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాం.

తద్వారా సిమెంట్ తయారీలో మార్కెట్ లీడర్‌గా ఉన్న ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి దగ్గరగా అంబుజా, ఏసీసీ కంపెనీల తయారీ నిలుస్తుందని గౌతమ్ అదానీ ఓ ప్రకటనలో తెలిపారు. భారత్‌లో అత్యంత లాభదాయకమైన సిమెంట్ తయారీదారుగా నిలవాలని భావిస్తున్నట్టు గౌతమ్ అదానీ పేర్కొన్నారు. దేశం ఆర్థికంగా పురోగతి సాధిస్తున్న ఈ తరుణంలో సిమెంట్ రంగంలోకి వచ్చాం. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సిమెంట్ తయారీదారుగా భారత్ ఉంది.

అయినప్పటికీ తలసరి వినియోగంలో వెనకబడి ఉన్నాం. చైనాలో సిమెంట్ తలసరి వినియోగం 1.6 టన్నులు ఉండగా, భారత్‌లో ఇది 250 కేజీలు మాత్రమే. కాబట్టి ఈ రంగం 7 రెట్లు వృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. అనేక ప్రభుత్వ కార్యక్రమాలు వేగంగా పెరుగుతున్న సమయంలో దీర్ఘకాలానికి సిమెంట్ గిరాకీ జీడీపీలో 1.2 రెట్ల నుంచి 1.5 రెట్లకు పెరగవచ్చు. దీన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా ఉన్నామన్నారు. అలాగే, ప్రభుత్వం మౌలిక సదుపాయాల రంగంలో భారీ పెట్టుబడులకు సిద్ధమైన ఈ తరుణంలో సిమెంట్ వ్యాపారం లాభదాయకంగా ఉంటుందని ఆశిస్తున్నాం. తద్వారా దేశీయ సిమెంట్ రంగంలో మెరుగైన వృద్ధిని చూస్తున్నామని గౌతమ్ అదానీ వివరించారు. ఇదే సమయంలో భారత వృద్ధిపై విశ్వాసాన్ని కలిగి ఉండటమే సమ్ష్త ఉద్దేశ్యమని, 2050 నాటికి దేశం 25-30 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా నిలుస్తుందని, దీనివల్ల అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని గౌతమ్ అదానీ వెల్లడించారు.

Next Story

Most Viewed