పునరుత్పాదక ఇంధనంలో 10 వేల మెగావాట్ల తొలి భారత కంపెనీగా అదానీ గ్రీన్

by Gopi |
పునరుత్పాదక ఇంధనంలో 10 వేల మెగావాట్ల తొలి భారత కంపెనీగా అదానీ గ్రీన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అదానీ గ్రూప్ అనుబంధ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అరుదైన ఘనతను సాధించింది. బుధవారం గుజరాత్‌లోని ఖావ్‌డా సోలార్ పార్క్‌లో కొత్తగా 2,000 మెగావాట్ల సౌర ఇంధన సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కంపెనీ ప్రకటించింది. దీంతో దేశీయంగా 10,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఉన్న మొదటి కంపెనీగా నిలిచామని పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ నిర్వహణ పోర్ట్‌ఫోలియో 10,934 మెగావాట్లకు చేరుకుంది. ఇందులో 7,393 మెగావాట్లు సోలార్, 1,401 మెగావాట్లు పవన్ విద్యుత్, 2,140 మెగావాట్లు పవన-సోలార్ హైబ్రిడ్ విద్యుత్ సామర్థ్యం కలిగి ఉన్నామని అదానీ గ్రీన్ వివరించింది. 2030 నాటికి 45 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని కంపెనీ లక్ష్యంగా ఉంది. ప్రస్తుతం ఉన్న పునరుత్పాదక ఇంధన సామర్థ్యంతో 58 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరాను అందించవచ్చు. ఏడాదికి 2.1 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను నివారిస్తుందని వెల్లడించింది. ఒక దశాబ్దం కంటే తక్కువ కాలంలో స్వచ్ఛ ఇంధన కలలను అదానీ గ్రీన్ ఎనర్జీ నిజం చేయడం సంతోషంగా ఉందని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తెలిపారు. 2030 లక్ష్యాలను సాధించేందుకు ఖావ్‌డాలో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ప్లాంటును ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Next Story

Most Viewed