భారీగా తగ్గిన IPO నిధుల సేకరణ!

by Disha Web Desk 17 |
భారీగా తగ్గిన IPO నిధుల సేకరణ!
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)ల ద్వారా మొత్తం 37 దేశీయ కంపెనీల నిధుల సేకరణ సగానికి పడిపోయింది. 2021-22 లో మొత్తం 53 ఐపీఓల ద్వారా కంపెనీలు రూ. 1,11,547 కోట్ల నిధులను సేకరించాయి. 2022-23లో మాత్రం ఇది రూ. 52,116 కోట్లను మాత్రమే సమీకరించగలిగాయని నివేదిక తెలిపింది. ప్రైమ్ డేటాబేస్ నివేదిక ప్రకారం, సమీక్షించిన ఆర్థిక సంవత్సరంలో అతి పెద్ద ఐపీఓగా దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ రూ. 20,557 కోట్లను, ఆ తర్వాత ఢిల్లీవెరి(రూ. 5,235 కోట్లు), గ్లోబల్ హెల్త్(రూ. 2,206 కోట్లు) సేకరించాయి.

2022, డిసెంబర్ నాటికి టాటా ప్లే సహా మొత్తం 68 కంపెనీలు ఐపీఓ కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వద్ద దరఖాస్తు చేశాయి. 2022-23లో వచ్చిన 37 ఐపీఓల్లో 25 మే, నవంబర్, డిసెంబర్ మూడు నెలల్లోనే మార్కెట్‌కు వచ్చాయని ప్రైమ్ డేటాబేస్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రణవ్ హల్దియా చెప్పారు.

ఇప్పటివరకు మార్కెట్లలో లిస్ట్ అయిన 36 ఐపీఓల్లో 16 కంపెనీలు 10 శాతానికి రాబడినిచ్చాయి. అందులో అత్యధికంగా హర్ష ఇంజనీర్స్(47 శాతం), ఎలక్ట్రానిక్ మార్ట్(43 శాతం), డీసీఎక్స్ సిస్టమ్స్(49 శాతం) ఆదాయాన్ని మదుపర్లకు ఇచ్చాయి. ఇక, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 54 కంపెనీలు ఐపీఓకు సిద్ధంగా ఉన్నాయి. ఇవి రూ. 76,189 కోట్ల నిధులను సేకరించనున్నాయి. మరో 19 కంపెనీలు దాదాపు రూ. 32,940 కోట్లకు సెబీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి.


Next Story

Most Viewed