ఆరోగ్య బీమా నిబంధనల్లో మార్పులు చేసిన ఐఆర్‌డీఏఐ

by Dishanational1 |
ఆరోగ్య బీమా నిబంధనల్లో మార్పులు చేసిన ఐఆర్‌డీఏఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్‌డీఏఐ) ఆరోగ్య బీమా క్లెయిమ్‌లకు సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ప్రధానంగా ఆరోగ్య బీమా పాలసీని కొనే పాలసీదారులకు ప్రయోజనం కలిగేలా ముందస్తు వ్యాధుల వెయిటింగ్ పీరియడ్, మారటోరియం పీరియడ్‌లను తగ్గించింది. బీమా పాలసీ కొనే సమయంలో వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం సాధారణం. ఎంచుకున్న పాలసీ కవరేజీ మొదలయ్యేందుకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంతకంటే ముందు అనారోగ్య సమస్యలు ఎదురైతే బీమా కొనుగోలు చేసిన వ్యక్తి ఆసుపత్రిలో చేరాల్సి వస్తే ఎటువంటి కవరేజీ వర్తించదు. దీన్ని ప్రీ-ఎగ్జిస్టింగ్ డిసీజ్(పీఈడీ) వెయిటింగ్ పీరియడ్ అంటారు. ఇప్పటివరకు 4 ఏళ్లుగా ఉన్న దీన్ని మూడేళ్లకు కుదిస్తూ ఐఆర్‌డీఏఐ నిబంధనలు మార్చింది. దీనివల్ల బీమా కొనుగోలు చేసేవారికి ప్రయోజనం ఉంటుంది. అయితే, విదేశీ ప్రయాణాలకు తీసుకునే పాలసీలకు ఇది వర్తించదు. అదేవిధంగా ఆరోగ్య బీమా మారటోరియం పీరియడ్‌లో కూడా బీమా నియంత్రణ సంస్థ మార్పులు చేసింది. . యాక్టివ్ హెల్త్ ఇన్సూరెన్స్ మారటోరియంను 8 ఏళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గించింది. దీనర్థం.. పాలసీ కొన్న తర్వాత ఐదేళ్ల పాటు క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లిస్తే పాలసీ ఒప్పందంలో భాగంగా అన్ని క్లెయిమ్‌లను బీమా కంపెనీ చెల్లించాలి. ఇక, పాలసీ మొదలయ్యాక కొన్ని వ్యాధులు, చికిత్సలకు 36 నెలల వరకు కవరేజీ ఉండదు. అలాంటి నిర్దిష్ట వెయిటింగ్ పీరియడ్‌కు సమబంధించి కాలవ్యవధి ముగిసిన తర్వాత పాలసీలో పేర్కొన్న చికిత్సలకు కవరేజీ పొందడానికి వీలుంటుంది. ప్రమాదాలు జరిగిన సమయంలో దీనికి మినహాయింపు ఉంటుంది. ఇదివరకు ఈ వ్యవధి 4 ఏళ్లు ఉండగా, దీన్ని మూడెళ్లకు తగ్గించారు. ఐఆర్‌డీఏఐ చేసిన ఈ మూడు మార్పులు కొత్తగా బీమా పాలసీ కొనే వారితో పాటు ఇప్పటికే ఉన్న వాటికీ వర్తించనున్నాయి.


Next Story

Most Viewed