‘సరఫరా సమస్యల కంటే డిమాండ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి’

by  |
‘సరఫరా సమస్యల కంటే డిమాండ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి’
X

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది మార్చిలో కరోనా మహమ్మారి ఆర్థికవ్యవస్థను దెబ్బతీసిన తర్వాత ఎక్కువగా సరఫరా వ్యవస్థలోని సమస్యల పరిష్కారం కీలకంగా ఉండేది. రాబోయే బడ్జెట్‌లో సరఫరా కంటే డిమాండ్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలని ప్రముఖ రేటింగ్ సంస్థ ఇండియా రేటింగ్స్ తెలిపింది. కరోనా, లాక్‌డౌన్ వల్ల గతేడాది జూన్ త్రైమాసికంలో ఆర్థికవ్యవస్థ 23.9 శాతం ప్రతికూలతను నమోదు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత రెండో త్రైమాసికంలో 7.5 శాతం ప్రతికూలానికి మెరుగుపడింది. ఈ క్రమంలో గతేడాది రెండో భాగంలో వృద్ధి సానుకూలంగా ఉండొచ్చని, ఈ పరిణామాలు 2020-21 ఆర్థిక సంవత్సరాన్ని 7.5-8 శాతం ప్రతికూలతతో ముగించేలా కనిపిస్తున్నట్టు ఇండియా రేటింగ్స్ అభిప్రాయపడింది.

డిమాండ్ వైపు దృష్టి పెట్టేందుకు ఇది సరైన సమయం. అదేవిధంగా సరఫరా వైపు సమస్యలను పరిష్కరైంచడం తప్పు లేదు కానీ, తగినంత డిమాండ్ లేకపోవడం వల్ల ఆర్థికవ్యవస్థ రికవరీని దెబ్బతీస్తుందని ఇండియా రేటింగ్స్‌కు చెందిన సునీల్ కుమార్ సిన్హా చెప్పారు. ప్రభుత్వం, ఆర్‌బీఐ చర్యల నేపథ్యంలో సరఫరా వైపు ఉన్న అడ్డంకులు పునరుద్ధరించబడినప్పటికీ వస్తువులు, సేవల వైపు తగిన డిమాండ్ లేదని, తద్వారా రానున్న రోజుల్లో ఇబ్బందులు ఉండొచ్చని సునీల్ కుమార్ పేర్కొన్నారు. డిమాండ్‌ను పెంచుతూ, ఖర్చులు, అధిక పన్నేతర ఆదాయాన్ని సమీకరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సునీల్ అభిప్రాయపడ్డారు.



Next Story

Most Viewed