ఇందులో పేదోడు.. పెద్దోడు అన్న తేడాలేదు

by  |
ఇందులో పేదోడు.. పెద్దోడు అన్న తేడాలేదు
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: రెవెన్యూలో వసూల్ రాజాలు. పైసలివ్వనిదే.. పని చేయరు. అడిగినంత ముట్టజెప్పే వరకూ రాబంధుల్లా పీక్కుతింటారు. పేద, ధనిక అనే తేడా వారి కళ్లకు ఆనదు. నిలువునా దోసుడే పనిగా కూర్చుంటారు. అటెండర్ నుంచి జిల్లాస్థాయి ఉన్నతాధికారుల వరకు ఎవరి స్థాయిలో వారికి చేతిలో డబ్బు పడితేనే దస్త్రం కదులుతుంది. జనాలు రెవెన్యూ శాఖ అంటే అవినీతి మకిలీ అంటిన డిపార్ట్ మెంట్ గా చూస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో జోరుగా చర్చ..

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర తహసీల్దార్ రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన నేపథ్యంలో రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో రెవెన్యూ పనితీరుపై జోరుగా చర్చ సాగుతోంది. రెవెన్యూ శాఖలో పహణీ నుంచి పట్టాదారు పాసు పుస్తకం వరకూ, సర్వే, భూ బదలాయింపు, రెవెన్యూ రికార్డుల్లో మార్పులు ఏదైనా సరే… వేల రూపాయలు సమర్పించుకోనిదే పని కాదనేది ప్రజలు బహాటంగానే చెబుతున్నారు. ప్రతీ దానికి నియమిత రుసుం, నిర్దేశిత గడువున్నా.. అమలుకు మాత్రం దిక్కులేదని, ఏళ్ల తరబడి దరఖాస్తులు పెండింగ్ లో ఉండడంతో లక్షల మంది సతమతమవుతున్నారని వాపోతున్నారు. ఏ కాగితం, ఆధారం లేకుండా కొందరు తహసీల్దార్లు నేరుగా పట్టాదారు పుస్తకాలను సృష్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. భూములు ఆక్రమణనకు గురవుతున్నాయి. కోర్టు సైతం హక్కు నిర్ధారించిందని బాధితులు చెప్పినా వినిపించుకోకుండా కొందరు రెవెన్యూ అధికారులు డబ్బులిచ్చిన వారికే కొమ్ము కాస్తున్నారు. పైసల ఆశతో కోర్టు ధిక్కారానికి సైతం వెనకడటంలేదు.

కలెక్టర్ల దృష్టికి వెళ్లినా..

మండలస్థాయిలో సమస్యలు పరిష్కారం కావడంలేదని జిల్లా కలెక్టర్లకు నివేదించుకున్నా ప్రయోజనం ఉండడం లేదు. చుక్క, గీత, ఒక్క అక్షరం చివరకు ఏ రాత ఉన్నా వాటిని సరి చేయాలంటే వేలల్లో ఖర్చే. పట్టదారు పాసుపుస్తకం, టైటిల్ డీడ్, ఆన్ లైన్ లో నమోదు, హద్దుల నిర్ధారణ, వారసులుగా పేర్లు నమోదు చేయించుకోవడం..ఏ పనికైనా ధర నిర్ణయించేస్తున్నారు. అనుకున్న మొత్తం దక్కితేనే దస్త్రం కదులుతుంది. అన్ని పత్రాలు సరిగా ఉంటే కొత్త సమస్య సృష్టించైనా సరే సొమ్ము గుంజే ఘనులకు రెవెన్యూలో కొరత లేదు. రెవెన్యూ వేధింపులు భరించలేక కొందరు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్ తోపాటు శివారు జిల్లాల్లో నెలలో ఇద్దరైనా ఏసీబీకి పట్టుబడుతున్నారు. తహసీల్దార్ నాగరాజు ఏసీబీకి పట్టుబడిన వారం రోజుల్లోనే రంగారెడ్డి జిల్లా కలెక్టరేలో ఓ అధికారి ఏసీబీకి చిక్కడం అవినీతిస్థాయిని చాటిచెప్పేందుకు ప్రత్యక్ష నిదర్శనం.

కాళ్లరిగేలా తిరగాల్సిందే..

కంప్యూటర్ పహణీ కోసం వారం రోజులుగా తిరగాల్సి వస్తుంది. పేరు మార్పు, కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలకు రెండుమూడు నెలల పాటు ప్రదక్షిణ తప్పడం లేదు. భూ కొలతలు, హద్దులు, నిర్ణయించేందుకు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఉద్దేశపూర్వకంగా దస్త్రాలను తారుమారు చేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పాసు పుస్తకాల్లో సర్వే నెంబర్లు నమోదు చేసి ఆన్ లైన్​లో పొందు పరచకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. రైతు బంధు, బీమా దక్కడం లేదు. భూమి కొలతల సమయంలో చలానా కట్టినా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. మీ సేవ కేంద్రాల్లో ధ్రువపత్రాలకు డబ్బులు వసూలు చేసి రెవెన్యూ సిబ్బందికి ఇస్తున్నారు. ఇలాంటి కేంద్రాల నిర్వాహకుల వద్దకు వెళ్తే పనులు తొందరగా అవుతున్నాయి. కీసర నాగరాజు ఏసీబీకి పట్టుబడిన నాటి నుంచి ‘దిశ’ ప్రతినిధి పలువురు రైతులు, సిరాస్తిదారులు, ప్రజలను అరా తీస్తే పలు రెవెన్యూ కార్యాలయాల్లో వసూళ్లపై సమాచారం ఇచ్చారు. ఈ వసూళ్లు కూడా ఒక్కో కార్యాలయంలో ఒక్కో తీరుగా ఉన్నాయని, కొందరు నిజాయితీ గల తహసీల్దార్లు పని చేస్తున్న కిందిస్థాయి సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా వసూళ్ల దందాను కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.

డబ్బుల వసూళ్లు ఇలా..

Next Story

Most Viewed