బీర్కూరులో ఉద్రిక్తత.. కరెంట్ కోసం కత్తులతో గొడవ

by  |
katthulu-dhadi1
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: విద్యుత్ వాడకంపై ఇద్దరి మధ్య గొడవ చెలరేగి కత్తిపోట్ల వరకు దారితీసిన ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బీర్కూర్ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న సజ్జాద్ కొత్త ఇంటిని నిర్మాణం చేపడుతున్నాడు. ఆ ఇంటికి విద్యుత్ కోసం సజ్జాద్ అక్రమంగా విద్యుత్ స్తంభం నుంచి కరెంటు తీగలు వేసి వాడుకోవడంపై ఆ ఇంటి ఎదురుగా ఉన్న సల్లు అనే యువకుడు సజ్జాద్ పై విద్యుత్ అధికారులకు శనివారం ఉదయం ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కొంతమంది పెద్దలు గొడవ సద్దుమణిగేలా సర్ధి చెప్పి ఎవరి ఇంటికి వారిని పంపించారు.

సల్లు అనే వ్యక్తి బాన్సువాడకు వెళ్లి ముగ్గురు వ్యక్తులను బీర్కూర్ కు తీసుకువచ్చి శనివారం రాత్రి 8 గంటలకు సల్లు వర్గం సజ్జాద్ ఇంటిపైకి కత్తులతో దాడికి ప్రయత్నించాడు. ఇది తెలుసుకున్న బంధువులు అక్కడికి చేరుకోగానే ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సల్లు తీసుకువచ్చిన ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో సజ్జాద్, ఫయాజ్, అస్లాం, సమీ తీవ్ర గాయాలకు కావడంతో వారిని చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండు వర్గాల మధ్య కత్తులతో దాడి జరగడంతో బీర్కూరులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం తెలుసుకున్న రూరల్ సీఐ చంద్రశేఖర్, ఇన్ చార్జ్ ఎస్సై నాగభూషణం సంఘటనా స్థలానికి చేరుకుని కత్తులతో దాడులకు పాల్పడ్డ ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఘటనా స్థలం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా శనివారం రాత్రి పోలీసు బలగాలను మోహరించారు.

Next Story

Most Viewed