అమ్మనాన్న చనిపోయారు.. సోనూసూద్ వచ్చారు

by  |
అమ్మనాన్న చనిపోయారు.. సోనూసూద్ వచ్చారు
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: వారికి నిండా పదేండ్ల వయస్సు లేదు. ఇద్దరు అన్నదమ్ములు, ఓ చెల్లి. ఏడాది క్రితం తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. వారం రోజుల క్రితం అనారోగ్యంతో తల్లి కూడా కన్నుమూసింది. ఫలితంగా అభంశుభం తెలియని ఆ ముగ్గురు చిన్నారులు రోడ్డునపడ్డారు. అమ్మా.. ఎప్పుడొస్తావంటూ ఆ చిన్నారుల రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. అందరితో ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యంలో చెల్లెలు, తమ్ముడికి వండి పెడుతూ.. ఆ చిన్నారి అన్న ఆలనాపాలన చూసుకుంటూ.. అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. ఈ హృదయ విదారక ఘటన ఇటీవల యాదాద్రిభువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలో చోటుచేసున్న విషయం తెలిసిందే. అయితే తమను ఆదుకునేందుకు ఎవరైనా ఆపన్నహస్తం అందించాలంటూ ఎదురుచూస్తున్నాడు.

దీంతో విషయం తెలిసిన వెంటనే సినీనటుడు సోనూసూద్ స్పందించాడు. కరోనా కష్టకాలంలో వలస కార్మికులను ఆదుకోవడం దగ్గరి నుంచి ఇటీవల వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని శారద.. ఉద్యోగం కోల్పోయి కూరగాయలు అమ్ముకునే విషయం తెలుసుకుని ఆదుకునే వరకు విశ్రాంతి లేని యోధుడిగా సినీ నటుడు సోనూసూద్ అందరికీ అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే అమ్మనాన్న లేక ముగ్గురు పిల్లలు అనాథలైన సంగతి తెలుసుకున్న సోనూసూద్.. పిల్లలను ఆదుకునేందుకు ముందుకొచ్చాడు. పిల్లల బాధ్యతనంతా తానే తీసుకుంటానని ట్విట్టర్ వేదికగా సోనూసూద్ ప్రకటించారు. సోనూసూద్ తీసుకున్న నిర్ణయం పట్ల నెటిజన్లతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed