రాష్టంలో ఏం జరుగుతుందో తెలియనప్పుడు సీఎంగా ఎందుకు?

by  |
రాష్టంలో ఏం జరుగుతుందో తెలియనప్పుడు సీఎంగా ఎందుకు?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏ జిల్లాల్లో ఏ సమస్య ఉంది… రైతులకు ఇబ్బందులు ఉన్నాయా? కరోనా సమస్య ఉందా? దానితో ప్రజలు చచ్చిపోతున్నారా?… మీకు చెప్పేవారు లేరా? ముఖ్యమంత్రిగా ఏం తెలియడం లేదా? అలాంటప్పుడు సీఎంగా ఎందుకు కూర్చున్నారని కేసీఆర్ ను బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి ప్రశ్నించారు. సోమవారం బీజేపీ చేపట్టిన తెలంగాణ రైతు గోస.. బీజేపీ పోరు దీక్షను ఆమె స్వగృహంలో చేపట్టారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అకాల వర్షాలతో పంట పూర్తిగా నష్టం జరిగిందని, నీళ్లల్లో ధాన్యం కొట్టుకుపోయిందని, మా కష్టాలు తీర్చండి అని రైతులు 20 రోజులు గోస పెడుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం హెలికాప్టర్ లో వరంగల్ కు వెళ్తుంటేనే రైతుల ఇబ్బందులు కనబడ్డాయా? … రైతుల సమస్యలను అధికారులు, కలెక్టర్లు వచ్చి చెప్పలేదా? అని ప్రశ్నించారు. ప్రతి గింజను కూడా కొంటామని… సమస్యలను పరిష్కరించాలని చెప్పడం కాదు… ఇప్పటి వరకు ఏ సమస్య పరిష్కరించారో చెప్పాలని డిమాండ్ చేశారు.

పాత వాగ్దానాలే నెరవేర్చలేదు… ఇప్పుడు కొత్త వాగ్దానాలా అని ప్రశ్నించారు. గాంధీ, ఎంజీఎం కు వెళ్లివచ్చారు.. ఏం పరిష్కరించారన్నారు. కరోనా సమయంలో సీఎం కేసీఆర్ ను ఎవరూ ప్రశ్నించరనే ఉద్దేశంతోనే దవాఖాలకు వెళ్లివచ్చారని ఎద్దేవా చేశారు. రైతులపై చిత్తశుద్ధి ఉంటే ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, నష్టపరిహారం చెల్లించాలని, రైతు బంధు, రుణమాఫీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కొనుగోలు కేంద్రాల్లో టార్ఫాలిన్లు లేవు… గోడౌన్లు లేవు…ఆదుకోవడం లేదు… నువ్వు అసలు ఏం చేస్తున్నవ్ అని సీఎంను ప్రశ్నించారు. ఇప్పటికైన స్పందించి యుద్దప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు చేయాలని, తడిసిన, రంగుమారిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలని, తాలు, తరుగు పేరుతో రైతులను వేధించడం ఆపాలని కోరారు.



Next Story