రైతుల విషయంలో రాజకీయాలు చేయొద్దు.. ఆ బాధ్యత కేంద్రానిదే!

by  |
Bhupalpally MLA Gandra Venkata Ramana Reddy
X

దిశ, భూపాలపల్లి: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటపై రాజకీయాలు చేయడం సరికాదని, ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బాయిల్డ్ రైస్ తప్ప వేరే రైస్ రాదని, ఏప్రిల్, మే నెలలో వచ్చే ధాన్యాన్ని నార్మల్‌గా పట్టిస్తే 40 నుంచి 60 శాతం వరకు వేస్టేజ్ పోతుందని, ఆ ధాన్యాన్ని కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని సూచించారు. వేల కోట్లు ఖర్చుపెట్టి రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు నష్టపోవాలని ఎందుకు కోరుకుంటాడని ప్రశ్నించారు. రైతుబీమా, ఉచిత కరెంట్, రైతుబంధు ఇచ్చి వ్యవసాయాన్ని పండుగ చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. కేంద్రం అవలంభిస్తోన్న రైతు వ్యతిరేక చర్యల వల్ల దేశ వ్యాప్తంగా రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోడీకి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. నల్ల చట్టాలను రద్దు చేసేవరకూ ఢిల్లీలో పోరాటం చేసిన ఉద్యమం చరిత్రలో మొదటిసారి అని కొనియాడారు. రైతులను మరోసారి ఇబ్బందులకు గురిచేయకుండా తక్షణమే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి, ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లిలో రూ.55 కోట్లతో నూతన మెడికల్ కాలేజ్, రూ.70 కోట్లతో డ్రింకింగ్ వాటర్ పనులు, రూ.70 కోట్లతో చెల్పూర్ నుండి బాంబుల గడ్డ వరకు సైడ్ డ్రైన్, రోడ్డు విస్తరణ పనులు, రూ.5.5 కోట్లతో 3 ఎకరాల్లో మోడల్ వెజిటేబుల్-నాన్‌వెజ్ మార్కెట్, రూ.2కోట్లతో అధునాతన కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ ప్రపోజల్‌లో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ వెంకట సిద్దురాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్, యూత్ ప్రెసిడెంట్, మహిళ టౌన్ ప్రెసిడెంట్, కో-ఆప్షన్ సభ్యులు, మైనార్టీ టౌన్ అధ్యక్షులు, కౌన్సిలర్లు, టౌన్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed