ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి పేరుతో ఆలయం!

by  |
ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి పేరుతో ఆలయం!
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నో ఏళ్లుగా ముడిపడ్డ చిక్కుముడి వీడింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి నేడు భూమి పూజ జరిగింది. అయితే ఇదేరోజు మరో “జమో” మందిరానికి భూమి పూజ జరిగింది. ఇదే రోజు భూమి పూజ చేస్తే తరతరాలు గుర్తుండిపోతుంది అని కాబోలు… ఈ ఆలయానికి కూడా ఇవాళే శంకుస్థాపన చేసారు అభిమానులు. ఇంతకీ ఈ జమో మందిరం ఏమిటా అని ఆలోచిస్తున్నారా…? అదేనండి ఏపీ సీఎం “జ”గన్ “మో”హన్ రెడ్డికి అభిమానులు కట్టిస్తున్న ఆలయం.

పశ్చిమ గోదావరి జిల్లా, గోపాలపురం మండలం, రాజంపాలెంలో సీఎం జగన్ కు వైసీపీ శ్రేణులు గుడి కట్టిస్తున్నారు. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలుగా మేలు చేస్తున్న జగన్ ను దేవుడిలా కొలిచేందుకు ఈ మందిరాన్ని నిర్మిస్తున్నట్టు స్థానిక వైసీపీ నేత కురుకూరి నాగేశ్వరరావు తెలిపారు. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు ఆలయ రూపంలో చరిత్రలో నిలిచిపోతాయని ఆయన ఆశించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు జగన్ చేసిన పాదయాత్రను, ఆయన పరిపాలన తీరును ప్రశంసించారు. ఈ గుడి నిర్మాణం పూర్తయితే జగన్ కు అంతా మంచే జరుగుతుందని, ఎటువంటి దుష్టశక్తులు ఆయన చెంతకు చేరవన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ మరణించినప్పుడు తమ అభిమాన నాయకుడు మరణించాడన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేక చాలామంది ప్రాణాలు విడిచారు. చాలామంది తమ ఇళ్లలో వైఎస్సార్ ఫోటో పెట్టుకుని దేవుడిలా కొలుస్తారు కూడా. ఇక ఏపీ లో దాదాపు ప్రతి ఉర్లోనూ ఆయన విగ్రహాలు ప్రతిష్టించారు అభిమానులు.

కానీ జగన్ అభిమానులు ఇంకాస్త ముందుకెళ్లి ఏకంగా జగన్ కి గుడినే కట్టిస్తున్నారు. తమిళనాడులో తమ అభిమాన హీరోయిన్లకు గుడులు కట్టించి పూజిస్తారని తెలుసు. ఇప్పుడు ఏపీలో కూడా తమ నాయకుడికి గుడి కట్టడానికి పూనుకున్నారు అభిమానులు. సీనియర్ ఎన్టీఆర్ కి ఒక అభిమాని తన ఇంట్లోనే గుడి నిర్మించి పూజిస్తుంటాడు. ఆయన తర్వాత ఆ ఘనత సీఎం జగన్ కే దక్కింది.

Next Story

Most Viewed