సారీ సీఎం సార్.. గట్ల జేలేం

by  |
సారీ సీఎం సార్.. గట్ల జేలేం
X

దిశ‌, ఖ‌మ్మం: తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేయాల‌ని భావిస్తున్న నియంత్రిత వ్య‌వ‌సాయ సాగు విధానంపై భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా రైతాంగం నిర‌స‌న స్వ‌రాలు వినిపిస్తోంది. వాస్త‌వ ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోకుండా రైతుల అభిప్రాయాల‌ను ఏ మాత్రం తెలుసుకోకుండానే జిల్లా వ్య‌వ‌సాయ‌శాఖ అధికారులు వానా కాలం సాగు ప్ర‌ణాళిక‌ను రూపొందించ‌డ‌మేంట‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. పంట మార్పిడి చేయాల‌నీ, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట‌ల‌నే పండించాల‌న్న సీఎం వ్యాఖ్య‌ల‌పైనా భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సీఎం కేసీఆర్ చెప్పేది నియంత్రిత సాగు విధానం కాదనీ, నియంతృత్వ విధానమని కొందరు గిరిజన పోడు, చిన్న, సన్నకారు రైతులు అంటున్నారు.

జిల్లాలో పంట‌ల సాగు ప‌రిస్థితి ఇదీ..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ‌, ఇల్లందు, టేకుల‌ప‌ల్లి, ఆళ్ల‌ప‌ల్లి, ద‌మ్మ‌పేట‌, గుండాల‌, భ‌ద్రాచ‌లం మండ‌లాల్లో మొక్క‌జొన్న పంటను ఎక్కువ‌గా సాగు చేస్తుంటారు. ఇల్లందు మండ‌లంలో అత్య‌ధికంగా 15 వేల ఎక‌రాల్లో, గుండాల మండలంలో 13 వేల ఎకరాల్లో, తాళ్లపల్లి మండలంలో నాలుగు వేల ఎకరాల్లో, టేకులపల్లిలో ఐదు వేల ఎకరాల్లో మొక్కజొన్నను ప్ర‌ధాన పంట‌గా సాగు చేస్తూ వ‌స్తున్నారు. ఈ మండ‌లాల్లో వ్య‌వ‌సాయం ఎక్కువ‌గా వ‌ర్షాధారితంగానే కొన‌సాగుతోంది. దీనికి తోడు పోడు వ్య‌వ‌సాయం చేసుకునేవాళ్లే అధికంగా ఉన్నారు. కొండ‌లు, గుట్ట‌ల‌పై వ్య‌వ‌సాయం చేస్తుంటారు. గతేడాది మొత్తం 43,500 ఎక‌రాల్లో మొక్కజొన్న పండించారు. 29,500 ఎకరాల్లో ప‌త్తిని సాగు చేశారు. అయితే, మొక్క‌జొన్నపంట‌ను ఈ ఏడాది వంద‌ల ఎక‌రాల్లోపే సాగు జ‌రిగేలా చూడ‌ట‌మే ల‌క్ష్యంగా వ్య‌వ‌సాయ అధికారులు ప్ర‌ణాళిక‌ను రూపొందించారు. జిల్లాలో 1,53, 763 ఎకరాల్లో వ‌రి, కందులు 13,500 ఎకరాల్లో, 1,83,436 ఎకరాల్లో పత్తి, 850 ఎకరాల్లో వేరుశ‌న‌గ, 38,392 ఎక‌రాల్లో పామాయిల్, 1,000 ఎక‌రాల్లో పెసర్లు, 100ఎక‌రాల్లో జొన్న‌లు‌ పండించేలా ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేశారు. 385ఎక‌రాల్లో త‌దిత‌ర పంట‌లు పండించేలా ప్ర‌ణాళిక‌ తయారు చేశారు. దీంతో ఈ ప్రణాళిక పట్ల రైతాంగం నుంచి వ్యతిరేకత వస్తోంది. ఆఫీసర్లు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోలేదనీ రైతులు చెబుతున్నారు.

ఆశయానికి..ఆచరణకు మధ్య తేడా

వ‌ర్షాధారిత ప్రాంతాల్లో కొండ‌లు, గుట్ట‌లపై వాణిజ్య పంట‌ల‌ను సాగుచేస్తే నష్టం ఉండదని అధికారులు ఎలా తేలుస్తారని ప్రశ్నించారు. సాగునీటి వ‌స‌తి లేని ప్రాంతాల్లో వేలాది రూపాయాలు పెట్టుబ‌డి పెట్ట‌లేమని చెబుతున్నారు. ప్ర‌భుత్వం ఆశ‌యం మంచిదే అయిన‌ప్ప‌టికీ ఆశ‌యానికి ఆచ‌ర‌ణ‌కు మ‌ధ్య పెద్ద అగాథం ఉన్నదని అంటున్నారు. ఈ విషయమై ఆఫ్ ది రికార్డులో ప్ర‌జాప్ర‌తినిధులూ ఒప్పుకుంటున్నారని సమాచారం. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంట‌ల‌నే రైతులు సాగు చేసేలా చూడ‌టం అన్న ప్ర‌భుత్వ ఆలోచ‌న బాగానే ఉన్న‌ప్ప‌టికీ అందుకు సాగునీరు అవసరమని గుర్తించడం లేదని చెబుతున్నారు. గిరిజ‌న జిల్లాలో సాగునీటి వ‌స‌తిపై దృష్టి సారించాల‌ని సూచిస్తున్నారు. అంత‌కంటే ముందు ఎన్నిక‌ల ఎజెండాగా మిగిలిపోతున్న పోడు భూముల‌కు సంబంధించిన ప‌ట్టాల‌ను సాగు చేసుకుంటున్న రైతుల‌కు ఈ ఏడాదైనా అంద‌జేయాల‌ని కోరుతున్నారు. నియంత్రిత వ్య‌వ‌సాయానికి లోబ‌డి సాగు చేస్తేనే రైతుబంధును వ‌ర్తింప‌జేస్తామ‌న్న షరతుపై రైతాంగం మండిపడుతోంది. ఇప్ప‌టికే అనేక కొర్రీలతో సాగుతున్న ఆ ప‌థ‌కం అసలు పోడు రైతుల‌కు అంద‌డం లేద‌నీ, ఇప్పుడు కొత్త‌గా జ‌ర‌గ‌బోయే నష్టం తమకేమీ లేదనీ, తమకు అందకున్నా పర్వలేదని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెబుతున్నారు. ఎప్ప‌టిలాగే మొక్క‌జొన్న పంట‌ను సాగు చేయ‌డం తప్ప వేరే మార్గ‌మేమీ తమకు క‌నిపించ‌డం లేద‌ని గిరిజ‌న రైతాంగం వాపోతోంది.

Next Story

Most Viewed