తేనెటీగలతో కొవిడ్ 19 టెస్ట్

by  |
తేనెటీగలతో కొవిడ్ 19 టెస్ట్
X

కొవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచం మొత్తం ప్రయత్నిస్తోంది. వ్యాక్సిన్స్ తీసుకున్నా సరే వైరస్ మ్యుటేట్ అవుతుండటంతో పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రస్తుతం కరోనా సింప్టమ్స్ ఉన్నా పాజిటివ్ లేదా నెగెటివ్ తెలుసుకునేందుకు కిట్స్ కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఈ క్రమంలో లండన్ శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఆదాయవనరులు తక్కువగా ఉన్న దేశాలు తేనెటీగల కొవిడ్ టెస్ట్‌ను ఫాలో అయిపోవచ్చని చెప్తున్నారు. ముందుగా జంతువుల్లో ఆ తర్వాత మానవులపై చేసిన ఈ తేనెటీగల టెస్ట్ సత్ఫలితాలను ఇచ్చిందని పేర్కొన్నారు.

దిశ, ఫీచర్స్ : తేనెటీగలు మానవుడి కంటే 100 రెట్ల శక్తివంతమైన ‘ఘ్రాణ శక్తి’ (సెన్స్ ఆఫ్ స్మెల్) కలిగి ఉంటాయి. ఒక తేనెటీగ కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న నిర్దిష్ట పువ్వు వాసన పసిగట్టగలుగుతుంది. దీంతో తుమ్మెదలకు శిక్షణ అందిస్తే రోగ నిర్ధారణ పరీక్షల్లో ఉపయోగపడతాయని, లండన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఆర్టిస్ట్ సుసానా సోరెస్ తేనెటీగలను వైద్యుల సహాయకులుగా ఉపయోగపడేలా శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం నెదర్లాండ్‌లోని వాగెనిన్గెన్ విశ్వవిద్యాలయం బయో వెటర్నరీ పరిశోధనా ప్రయోగశాల శాస్త్రవేత్తలు, డచ్ పరిశోధకులు COVID-19 సోకిన నమూనాలను గుర్తించడానికి తేనెటీగలకు శిక్షణ ఇవ్వడం విశేషం. పావ్లోవియన్ కండిషనింగ్(Pavlovian conditioning) పద్ధతిలో తేనెటీగలకు మొదట షుగర్ వాటర్‌ను ఆఫర్ చేస్తారు.

అలా చక్కెర నీటి ద్రావణాన్ని సేకరించడానికి అవి తమ నాలుకను విస్తరిస్తాయి. ఇదే పద్ధతిని పలుమార్లు ఫాలో కావడంతో.. అలవాటైపోయిన తుమ్మెదలు సహజంగానే సువాసన కోసం మాత్రమే తమ నాలుకను విస్తరిస్తాయని ప్రూవ్ అయింది. ఇదే విధానంలో ఈసారి కొవిడ్ సోకిన నమూనాను వాటికి అందిస్తారు పరిశోధకులు. ఆ సమయంలో అవి నాలుక అలానే విస్తరిస్తే కొవిడ్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించుకోవచ్చని చెబుతున్నారు. ఈ పద్ధతిలో పరీక్ష ఫలితాల కోసం వేచి ఉండే సమయాన్ని కేవలం సెకన్ల వరకు తగ్గించవచ్చని అభిప్రాయపడుతున్నారు. కాగా తేనెటీగ ఘ్రాణ శక్తి క్యాన్సర్ ట్యూమర్ కనుగొనడంలోనూ సాయపడుతోందన్న విషయం తెలిసిందే.

యూజ్‌ఫుల్ ఎక్స్‌పెరిమెంట్

పరిశోధకులు పని చేస్తున్న స్కేలబిలిటీపై మొదటి ప్రయోగంలో SARS-CoV-2 సోకిన మింక్స్ నుంచి నమూనాలను సేకరించారు. మింక్-శాంపిల్స్‌తో చేసిన ప్రయోగాలలో అనేక తేనెటీగలు మంచి ఫలితాలను సూచించాయి. వ్యాధి సోకిన నమూనాలను, ఆరోగ్యకరమైన జంతువుల నుంచి తక్కువ సంఖ్యలో ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగటివ్‌‌లతో వేరు చేయగలిగాయి. తర్వాత మానవ నమూనాలతో చేసిన ప్రయోగాలలో కూడా గొప్ప ఫలితాలు సాధించినట్లు పరిశోధకులు తెలిపారు. తేనెటీగలు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండగా ఒకేసారి బహుళ తేనెటీగలకు ఆటోమేటికల్లీ శిక్షణ ఇవ్వగల ప్రోటోటైప్‌ మెషీన్ డెవలప్ చేసిన బయోటెక్నాలజీ కంపెనీ ఇన్‌సెక్ట్‌సెన్స్.. రోగ నిర్ధారణ కోసం శిక్షణ పొందిన తేనెటీగలను నియమించే బయోసెన్సార్‌ను కూడా అభివృద్ధి చేసింది. కాగా ఈ సాంకేతిక పరిజ్ఞానం తక్కువ ఆదాయ దేశాలకు ఉపయోగపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.

బయోచిప్ అండ్ మెషిన్ లెర్నింగ్

తేనెటీగలకు శిక్షణ ఇచ్చేందుకు బయోచిప్ అండ్ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో పాటు లూమినోస్ టెక్నాలజీని శాస్త్రవేత్తలు(ఇన్‌సె‌క్ట్‌సెన్స్ వాగెనిన్గెన్ విశ్వవిద్యాలయం) వినియోగిస్తున్నారు. క్రిమి జన్యువులను ఉపయోగించడం ద్వారా అస్థిర పదార్ధాలను, వ్యాధి తీవ్రతను ఖచ్చితంగా గుర్తించడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఈ పద్ధతిలో వేగంగా పరీక్షించొచ్చు కానీ ఖర్చుతో కూడుకున్నదని పరిశోధకులు వివరించారు.

“ఇది మంచి ఆలోచన, కానీ COVID-19 ను గుర్తించటానికి తేనెటీగలను ఉపయోగించడం కంటే క్లాసిక్ డయాగ్నొస్టిక్ సాధనాలతో పరీక్షలు చేయటానికి ఇష్టపడతాను. నేను తేనెటీగ ప్రేమికుడిని. కాబట్టి వాటిని ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాను. 1990లలో పేలుడు పదార్థాలు, టాక్సిన్స్ గుర్తించడానికి యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ “ఇన్‌సెక్ట్ స్నిఫింగ్” ఉపయోగించింది. అంతేకాదు తేనెటీగలు, కందిరీగలను ఎక్స్‌ప్లోజివ్స్ కనుగొనేందుకు మాత్రమే కాదు వైద్య నిర్ధారణలోనూ వినియోగించగా మెరుగైన ఫలితాలు వచ్చాయి. అయితే వాగెనిన్గెన్ పరీక్ష ఫలితాలు బాగానే ఉన్నా, శాస్త్రీయ ఆధారం కాదు. అందువల్ల పిసిఆర్ టెస్ట్ అందుబాటులో లేనప్పుడు తేనెటీగ పరీక్ష ఆలోచన ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో COVID-19 టెస్ట్ సాంప్రదాయక రూపాలను భర్తీ చేసే సాంకేతికతను చూడలేను”

– డిర్క్ డి గ్రాఫ్, ఘెంట్ విశ్వవిద్యాలయం (బెల్జియం)
తేనెటీగలు, కీటకాలు, జంతు రోగనిరోధక శాస్త్ర ప్రొఫెసర్.

Next Story