గంగూలీ పదవికి ఎసరు?

by  |
గంగూలీ పదవికి ఎసరు?
X

దిశ, స్పోర్ట్స్: ఏ క్షణంలో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టాడో కానీ, అప్పటి నుంచి అన్నీ అవాంతరాలే ఎదురవుతున్నాయి. తన హయాంలో జరగాల్సిన తొలి ఐపీఎల్ కరోనా కారణంగా వాయిదా పడింది. మరోవైపు బీసీసీఐకి ఆర్థిక కష్టాలు మొదలైయ్యాయి. అధ్యక్ష పదవి కూడా మరో రెండు నెలల్లో ఊడబోతుంది. కాగా, మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఎంపీసీఏ) జీవితకాల సభ్యుడు సంజీవ్ గుప్తా చేస్తున్న ఆరోపణలు నిజమైతే గంగూలీ తక్షణమే పదవిని కోల్పోతాడు. జస్టీస్ లోథా సిఫారసుల మేరకు రూపొందించిన కొత్త బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఐసీసీకి నామినేట్ అయ్యే వ్యక్తి బీసీసీఐ పదవికి అనర్హుడు అవుతాడని సంజీవ్ గుప్తా చెబుతున్నారు. మంగళవారం నుంచి వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో ప్రారంభమైన ఐసీసీ అత్యవసర సమావేశాలకు బీసీసీఐ ప్రతినిధిగా గంగూలీని నామినేట్ చేశారు. దీంతో రూల్‌బుక్ ప్రకారం అతడు అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలని సంజీవ్ గుప్తా చెబుతున్నాడు. బీసీసీఐ రాజ్యాంగంలోని రూల్ నంబర్ 14(9) ప్రకారం ఐసీసీ బోర్డుకు నామినేట్ అయిన మరుక్షణం బీసీసీఐలో పదవి కోల్పోతాడని, దీని ప్రకారం గంగూలీని అనర్హుడిగా ప్రకటించాలని గుప్తా బోర్డుకు ఈ-మెయిల్ పంపించారు. దీనిపై బీసీసీఐ స్పందించింది. బీసీసీఐ రాజ్యాంగం మేరకు కేవలం ఆఫీస్ బేరర్లు మాత్రమే తమ పదవులు కోల్పోతారని, బీసీసీఐ అధ్యక్షుడికి ఈ నిబంధన వర్తించదని చెప్పింది. అయినా తప్పనిసరి పరిస్థితుల్లోనే ఐసీసీ బోర్డుకు గంగూలీ నామినేట్ అయ్యారని, ఫోర్స్‌డ్ నామినేషన్‌కు బీసీసీఐ నిబంధన వర్తించదని తేల్చి చెప్పింది. గతంలో కూడా పరస్పర విరుద్ధ ప్రయోజనాల పేరుతో సచిన్, రాహుల్ ద్రావిడ్, లక్ష్మణ్, గంగూలీపై ఆరోపణలు చేసింది ఈ సంజీవ్ గుప్తానే కావడం గమనార్హం. అప్పుడు కూడా వాళ్లు తమ పదవులను వదిలిపెట్టాల్సి వచ్చింది.

Next Story

Most Viewed