ఇండియా, పాకిస్తాన్ శ్రమ.. ఫుట్‌బాల్ నగరంలో క్రికెట్ స్టేడియం..!

by  |
ఇండియా, పాకిస్తాన్ శ్రమ.. ఫుట్‌బాల్ నగరంలో క్రికెట్ స్టేడియం..!
X

దిశ, స్పోర్ట్స్ : ‘బార్సిలోనా’ ‘క్రికెట్’ ఈ రెండు పదాలు ఒకే చోట కలవడం చాలా కష్టం. స్పెయిన్‌లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న బార్సిలోనా అంటే అదొక ఫుట్‌బాల్ అంటే మక్కువ ఉన్న నగరం. స్పెయిన్‌లో జనాలు ఫుట్‌బాల్ అంటే ప్రాణాలిస్తారు. ఇక బార్సిలోనాలో అయితే అంతకు మించిన క్రేజ్ ఉంటుంది. ఆ నగరంలో వేరే ఆటకు స్థానమే ఉండదన్నట్లు అనిపిస్తుంటుంది. నగరమంతా ఎక్కువగా పిల్లలు, పెద్దలు ఫుట్‌బాల్ ఆడుతూ కనిపిస్తుంటారు. అక్కడో ఇక్కడో ఒక బేస్ బాల్ ప్లేయర్స్ ఉంటారు. మొత్తానికి ఆ నగరంలో వేరే క్రీడలు కనిపించనే కనిపించవు. ఇప్పుడు అలాంటి నగరంలో ఏ స్టేడియం కావాలని ప్రభుత్వం అభిప్రాయ సేకరణ చేయగా.. అనూహ్యంగా క్రికెట్ స్టేడియం కావాలని మెజార్టీ ప్రజలు ఓటేయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నది. ఇంగ్లాండ్‌లో పుట్టిన క్రికెట్ బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించినట్లు అన్ని దేశాలకు పాకింది. కానీ పక్కనే ఉన్న యూరోపియన్ దేశాలకు మాత్రం వెళ్లకపోవడం గమనార్హం. కాగా, ఇప్పుడిప్పుడే స్పెయిన్, పోర్చుగల్ వంటి దేశాల్లో క్రికెట్ క్లబ్స్ ఊపందుకుంటున్నాయి.

క్రికెట్ స్డేడియంకే ఓటు..

బార్సిలోనా సిటీ మెట్రోపాలిటన్ నగర వ్యాప్తంగా 30 మిలియన్యూరోలతో క్రీడా సౌకర్యాలు మెరుగుపర్చాలని నిర్ణయించింది. 822 ప్రాజెక్టులను ప్రజల ముందు పెట్టి వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని ప్రజలను అడిగింది. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ బార్సిలోనా ప్రజలు క్రికెట్ స్టేడియం కావాలని ఓటేశారు. ఫుట్‌బాల్ తప్ప వేరే ఆట ఆడని స్పెయిన్ ప్రజలు క్రికెట్ స్టేడియం కావాలని కోరడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఒక్క రోజులో వచ్చిన మార్పు కాదు. మూడేళ్లుగా కొంత మంది అమ్మాయిల బృందం స్టేడియం కోసం చేసిన పోరాటంలో భాగంగానే బార్సిలోనా ప్రజలు అలా ఓటేశారు. గత మూడేళ్లుగా హిఫ్సా బట్ అనే అమ్మాయి మరి కొంత మంది పాకిస్తాన్, ఇండియా దేశాలకు చెందిన యువతులతో కలసి పోరాడుతున్నది. బార్సిలోనాలో ఒక క్రికెట్ స్టేడియం ఉండాలని చిన్నవయసు అమ్మాయిలు నగర ప్రజలనందరినీ ఒప్పించడం నిజంగా చాలా గ్రేట్ అని పలువురు అభినందిస్తున్నారు.

అలా మొదలైంది..

హిఫ్సాబట్ తండ్రి పాకిస్తాన్ నుంచి స్పెయిన్‌లోని బార్సిలోనాకు వలస వచ్చాడు. చిన్నప్పటి నుంచి టీవీల్లో క్రికెట్ మ్యాచ్‌లు చూపిస్తూ హిఫ్సాకు ఆటపై మక్కువ పెంచేలా చేశాడు. అంతే కాకుండా ఆటను ఎలా ఆడాలి? రూల్స్ ఎలా ఉంటాయనే విశేషాలు హిఫ్సాకు నేర్పించాడు. అలా హిఫ్సా తన ప్రాంతంలో కొంత మంది అమ్మాయిలను కూడగట్టి క్రికెట్ ఆడటం నేర్పించారు. ఆ తర్వాత నగరంలోని ఇతర ప్రాంతాలకు చెందిన పిల్లలు కూడా క్రికెట్ ఆడటం ప్రారంభించారు. దీంతో వారందరూ కలసి సీరియస్ మ్యాచ్‌లు ఆడటం మొదలు పెట్టారు. అయితే నగరంలో సరైన క్రికెట్ స్టేడియం లేకపోవడంతో అందుబాటులో ఉన్న బేస్‌బాల్ స్టేడియంలోనే క్రికెట్ ఆడుతున్నారు.

అయితే వారందరికీ.. నిజమైన క్రికెట్ స్టేడియంలో టెన్నిస్ బంతులతో కాకుండా డ్యూక్, కాకాబుర్రా బంతులతో మ్యాచ్‌లు ఆడాలనే కోరిక ఉన్నది. కానీ నగరం మొత్తంలో ఒక్క క్రికెట్ స్టేడియం కూడా లేకపోవడంతో నగర పాలక సంస్థను ఆశ్రయించారు. అయితే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కోసం విడుదల చేసే ఫండ్స్‌ను దేనికి కేటాయించాలో ఓటింగ్ నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. దీంతో నగరంలోని క్రికెట్ ప్రేమికులతో పాటు ఇతర ప్రజలను కూడా కలసి క్రికెట్ స్టేడియం కోసం ఓటేయమని వేడుకున్నారు. గత మూడేళ్లుగా ఇందు కోసం విస్తృతంగా ప్రచారం చేసి.. చివరకు ఈ ఏడాది తమ లక్ష్యాన్ని సాధించుకున్నారు. మరి కొన్ని నెలల్లోనే బార్సిలోనా నగరంలో క్రికెట్ స్టేడియం నిర్మాణం ప్రారంభం కానుంది. దీనంతటి వెనుక పాకిస్తాన్, ఇండియాకు చెందిన యువతులు ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. కేవలం బార్సిలోనాలోనే కాకుండా స్పెయిన్ అంతటా క్రికెట్ వ్యాప్తి చెందేలా కృషి చేస్తామని వారంటున్నారు.

Next Story

Most Viewed