మాట నిలబెట్టుకోని కేసీఆర్ : బండి సంజయ్

by  |
మాట నిలబెట్టుకోని కేసీఆర్ : బండి సంజయ్
X

దిశ, న్యూస్ బ్యూరో‌:
డాక్టర్లకు రక్షణ కల్పిస్తామని వాగ్దానం చేసిన సీఎం కేసీఆర్ మాట నిలుపుకోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. గాంధీ ఆస్పత్రి పూర్తిగా పోలీసుల గస్తీలో ఉంటుందని, ఎటుంటి అసంఘటిత చర్యలకు తావు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటామని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. ఈ విషయమై బుధవారం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఓ ప్రకటన చేశారు. గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లపై జరిగిన దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని వివరించారు. ఉస్మానియా ఆస్పత్రిలో 12మంది పీజీ వైద్య విద్యార్థులకు కరోనా సోకినా, రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్లకు కావాల్సిన రక్షణ అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కరోనా పరీక్షలు నిర్వహించకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం ఎన్-95 మాస్కులు, పీపీఈ కిట్లను సరఫరా చేసినా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎటువంటి సహకారాన్ని డాక్టర్లకు ఇవ్వడం లేదన్నారు. ప్రాణాలకు సైతం తెగించి కరోనా బారినపడ్డ రోగులకు వైద్యం చేస్తున్న డాక్టర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిలో సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లతో చర్చించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పరిష్కరించలేకపోతే, కేంద్ర ప్రభుత్వానికి వదిలేస్తే, సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నదని సంజయ్ తెలిపారు.

Next Story

Most Viewed