మౌజమ్‌లకు, ఫాదర్లకే జీతాలిస్తారా.. పూజారులకు ఎందుకివ్వరు : బండి సంజయ్

by  |
Bandi-sanjay
X

దిశ, తెలంగాణ బ్యూరో : ‘సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో పంటడు.. ఎన్నికలు వస్తేనే హైదరాబాద్‌కు వస్తాడు.. రాగానే ఫేకుడు షురూ చేస్తాడు.. ఆ కులానికి ఇది ఇస్తా.. ఈ వర్గానికి అది ఇస్తా.. అంటూ ఝటా హామీలు ఇస్తాడు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఆదివారం హైదరాబాద్‌లో బండి సంజయ్ మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమ్మవారి కరుణ తెలంగాణ ప్రజలపై ఉంటుందని, ప్రజలను రక్షించే తల్లికి బోనాలు సమర్పించడం తెలంగాణ ప్రజల ఆనవాయితి అని అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ఒక ప్రతీక అన్నారు. అమ్మవారి దీవెనల కోసం బోనమెత్తే ప్రతీ ఆడబిడ్డ మన సంస్కృతికి నిజమైన వారసురాలు అని తెలిపారు. అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్ట పడుతున్న పీఎం మోడీకి, ప్రజలకు ఉన్నత సేవలు అందించేలా మరింత శక్తిని ప్రసాదించాలని, ప్రజలకు మంచి పరిపాలన రావాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.

ప్రజలు అంతా గమనిస్తున్నారు..

ఓట్ల కోసం దేనికైనా కేసీఆర్ దిగజారుతారని దుయ్యబట్టారు. గతేడాది హైదరాబాద్‌లో వరదలొచ్చినప్పడు రూ.10 వేలు ఇస్తానని హామీ ఇచ్చి ఓ పది ఇరవై మందికి ఇచ్చి ఆపేశాడని విమర్శించారు. పైగా నేనే ఆపమన్నానని ఫోర్జరీ సంతకంతో లెటర్ సృష్టించాడని అన్నారు. ఇలాంటి సీఎంను ఇప్పటి వరకు చూడలేదన్నారు. గ్రామ దేవతలు చాలా పవర్ ఫుల్ అని, అమ్మవార్ల దయతో ప్రజలకు మేలు జరగాలని, చీటింగ్ చేసేవాళ్లకు తగిన శాస్తీ జరగాలన్నారు. తెలంగాణలోని ప్రతీ గ్రామంలో మహంకాళమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయాలు ఉంటాయని, ఆ గుడులకు బడుగు, బలహీన వర్గాల వారే పూజారులుగా ఉంటారని తెలిపారు.

మసీదుల్లో మౌజమ్‌లకు, చర్చీల్లో ఫాదర్‌లకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలిస్తున్నారని, ప్రతీ గ్రామంలోని అమ్మవార్లకు పూజలు చేసే బడుగు పూజారులకు జీతాలు ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నించారు. గ్రామ దేవతల పూజారులకు జీతాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. హిందూ గ్రామ దేవతల పూజారులపై సీఎం అవలంభిస్తున్న వివక్ష ధోరణి మానుకోవాలని కోరారు. ఈ బోనాల పండుగ రోజే గ్రామదేవతల పూజారుల వేతనాలపై కేసీఆర్ నిర్ణయం తీసుకోవాలన్నారు. లేదంటే అమ్మవారి స్ఫూర్తితో గ్రామదేవతల పూజారుల వేతనాల కోసం బీజేపీ పోరుబాట పడుతుందని హెచ్చరించారు.

Next Story