ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి నగలు మాయం.. ఆందోళన చేస్తున్న బీజేపీ

by  |
karthika
X

దిశ, బేగంపేట: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో జరిగిన అక్రమాలపై సీబీఐ చే విచారణ జరిపించాలని బీజేపీ నేత గ్రేటర్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి డిమాండ్ చేశారు. ఆలయంలో అమ్మవారి బంగారు ఆభరణాల మాయం అవ్వడంతో శుక్రవారం ఉదయం బీజేపీ శ్రేణులు మహంకాళి ఆలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రేటర్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి మాట్లాడుతూ.. దేవాలయములో జరిగిన అవినీతిని అరికట్టలేని ప్రభుత్వం తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయలకు భక్తులు సమర్పించిన కానుకలు, దేవాలయాల ఆస్తులను దోచుకుంటున్న వారికి ప్రభుత్వం అండగా ఉన్నట్లు ప్రవర్తించడం సిగ్గుచేటని ఆరోపించారు. ఈ విషయాన్ని స్థానిక మంత్రి కూడా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. అక్రమాలు చేసిన వారు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు.

అక్రమాలను ప్రోత్సహించిన అధికారులపై చర్యలు తీసుకోకుండా ప్రమోషన్ ఇవ్వడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేవాలయ ఆస్తులు, భూములను కాపాడడం కోసం బీజేపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా బండ కార్తీక రెడ్డి హెచ్చరించారు. ఆలయం ముందు ఆందోళన చేస్తున్న భాజపా నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం, గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ధర్నా కార్యక్రమంలో మహంకాళి జిల్లా అధ్యక్షులు భాజపా నేత శ్యాంసుందర్ గౌడ్, రాంగోపాల్ పేట స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్, రాజశేఖర్ రెడ్డి, శ్రీశైలం, ఆకుల ప్రతాప్, బిఎన్ శ్రీనివాస్, భాజపా నాయకులు భానుక మల్లికార్జున్, మనోజ్, పెద్ది రవి, మనోజ్ శ్రవణ్, సాయి, నరేందర్ పాల్, హెచ్ శ్రీనివాస్ సాయి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారికి కానుకగా ఇచ్చిన ఆభరణాలను భక్తులు తనిఖీ చేసుకోవచ్చు..

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి అభరణాల మాయమైనట్లు వచ్చిన వార్తలపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల విచారణ కొనసాగుతుందన్నారు. మహంకాళి అమ్మవారికి భక్తులు ఇచ్చిన కానుకలపై ఎవరికైనా అనుమానం ఉంటే వారు రిసిప్ట్ తీసుకుని వచ్చి ఆలయంలో ఆభరణాలను తనిఖీ చేసుకోవచ్చునని ఆలయ ఈవో మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు వరకు అమ్మవారికి సంబంధించిన ఆభరణాలు, బంగారం 15 కిలోల 315 గ్రాములు, 577 కిలోల వెండి, 3 కోట్ల 88లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని ఆలయ ఈవో మనోహర్ రెడ్డి వెల్లడించారు.


Next Story

Most Viewed