వారికి రూ.24,000 కనీస వేతనం ఇవ్వాలి.. ఎస్ బాలరాజ్

by  |
balaraj
X

దిశ, భువనగిరి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 198 మోడల్ స్కూల్ హాస్టల్స్‌లో పనిచేస్తున్న 1200 మంది కార్మికులకు కనీస వేతనం రూ.24,000/- చెల్లించాలని ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా‌లోని మోడల్ స్కూల్ హాస్టల్స్‌లో పనిచేస్తున్న కార్మికుల జిల్లా స్థాయి సమావేశం భువనగిరిలోని వర్తక సంఘం హాల్‌లో స్వప్న అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. మోడల్ స్కూల్ హాస్టల్స్‌లో పనిచేస్తున్న కేర్ టేకర్, ఏ.ఎన్.ఎం, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, వాచ్‌మెన్‌లకు ప్రతి నెల కేవలం రూ.6 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు.

24 గంటలు వారితో పని చేయిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నారని ఆరోపించారు. 2015 నుండి పనిచేస్తున్న కార్మికులకు ఏడు సంవత్సరాలు గడిచినా నేటికీ వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ మరియు గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదు. పీఎఫ్ సౌకర్యం అమలు చేయకుండా కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులకు 8 గంటల పని‌దినం అమలు‌తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రానున్న రోజులలో కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటాలు, ఉద్యమాలు నిర్వహిస్తామని, ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్త సమ్మె నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం నూతన జిల్లా కమిటీ‌ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడుగా ఎండి. ఇమ్రాన్, ఉపాధ్యక్షులుగా సైదుగాని స్వరూప, ప్రధాన కార్యదర్శిగా వాల్కి స్వప్న ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో గోరేటి రాములు గనబోయిన వెంకటేష్, సామల శోభన్ బాబు, స్వరూప, స్వప్న, మంజుల, ప్రమీల, జానీబి, పారిజాత, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed