బాలమిత్రలో టీచర్లదే ముఖ్యపాత్ర

by  |
బాలమిత్రలో టీచర్లదే ముఖ్యపాత్ర
X

చిన్నారుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన బాలమిత్రలో టీచర్లదే ప్రముఖ పాత్రని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. బాలమిత్ర ఏర్పాటు చేసి, ఏడాది గడిచిన సందర్భంగా సీపీ కార్యాలయంలో సోమవారం వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. తెలిసిన వారే ఎక్కువగా చిన్నారులపై ఘాతుకాలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేయడంతో, పిల్లలు వారి సమస్యను ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతున్నారన్నారు. లైంగికహింసకు గురవుతున్నవారిలో బాలురూ ఉంటున్నారన్నారని తెలిపారు. చిన్నారులపై జరిగే ఈ అకృత్యాలను అరికట్టడానికి, బాధితులు తమ బాధలను చెప్పుకోవడానికి ఏర్పాటు చేసిన వేదికనే ‘బాలమిత్ర’ అని వివరించారు. ఈ వేదిక ద్వారా మంచి, చెడుల గూర్చి పిల్లలకు వివరిస్తూ వారిలో చైతన్యం తీసుకొస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రతి పాఠశాలలో ఒక ఉద్యోగిని(కౌన్సెలర్‌)ను ఎంపిక చేసి, షీ టీమ్స్‌కు, విద్యార్థులకు మధ్య వారధిగా ఉంచుతామన్నారు.

విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్, షీ టీం ఇన్‌‌చార్జ్ డీసీపీ అనసూయ మాట్లాడుతూ.. బాలమిత్ర పిల్లలకు ఒక ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్‌గా పని చేస్తుందన్నారు. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ గురించి చెప్పడం, జెండర్ సెన్సిటైజేషన్, మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులపై అవగాహన కల్పించడం చేస్తారన్నారు. దీంతో విద్యార్థి దశ నుంచే సమాజం పట్ల గౌరవం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతమవడంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర ఉంటుందన్నారు. బాలమిత్ర ఫేస్ బుక్ పేజ్ కోసం balamithra.cyberabad పేజీని ఫాలో కావాలన్నారు. అలాగే ఈమెయిల్ ద్వారా [email protected]కి, వాట్సాప్ ఫోన్ నెంబర్ 94906 17444కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ పనితీరును కనబర్చిన బాలమిత్ర టీచర్లకు సజ్జనార్ బ్రేవరీ అవార్డులు ఇచ్చారు. కాగా, బాలమిత్రను 2019 ఫిబ్రవరి 15న అప్పటి మేడ్చల్‌ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి, సజ్జనార్‌‌లు ప్రారంభించిన విషయం తెలిసిందే.



Next Story