ఆర్థిక ప్యాకేజీపై ప్రేమ్‌జీ ఏమన్నారంటే..!

by  |
ఆర్థిక ప్యాకేజీపై ప్రేమ్‌జీ ఏమన్నారంటే..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రముఖ వ్యాపారవేత్త విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దేశంలో ఖచ్చితమైన విలువలను పాటించే వ్యాపారవేత్తగా పేరున్న అజీమ్ ప్రేమ్‌జీ సమాజానికి తనవంతు తిరిగివ్వడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇదివరకు వందల కోట్ల ఆస్తులను సమాజానికి, అభివృద్ధి కోసం దానమిచ్చారు. కరోనా సంక్షోభాన్ని నివారించేందుకు కేంద్రం అనుసరిస్తున్న విధానాలను, లోపాలను ప్రస్తావించారు. ప్రధానంగా లక్షల మంది వలస కార్మికులు తమ సొంత ఊర్లకు చేరుకోవడానికి ముందే దారిలో మరణిస్తుండటం క్షమించలేని విషయమని అజీమ్ ప్రేమ్‌జీ ఘాటుగా స్పందించారు. ఓ జాతీయ పత్రికలో ప్రత్యేక వ్యాసం ద్వారా ప్రభుత్వ విధానాలపై అభిప్రాయాలను రాశారు.

కార్మికుల హక్కుల్ని కాలరాయొద్దు…

పారిశ్రామికవేత్త అయినప్పటికీ.. కార్మికులు, వారి హక్కుల గురించి బహిరంగంగానే ప్రభుతాన్ని విమర్శించారు ప్రేమ్‌జీ. వ్యాపారవేత్తల ఒత్తిడితో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కుల్ని రూపుమాపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదన్నారు. ప్రధాని ప్రకటించిన జీడిపీలో 10 శాతానికి సమానమైన ప్యాకేజీ సరైందే అయినప్పటికీ వాస్తవంలో అమలు జరగాలని ఆశించారు. తన యాభై ఏళ్ల పారిశ్రామిక జీవితంలో ఎన్నడూ బలవంతంగా కార్మిక చట్టాలను అమలు పరచలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా, అలవికాని ట్రేడ్ యూనియన్లను కూడా అనుమతించలేదని చెప్పారు. కరోనాను అడ్డుకోవడంలో మనం ప్రాథమిక దశలోనే ఉన్నామని, ఈ క్రమంలో జీవనోపాధితో పాటు జీవించి ఉండటం ఎంతో ముఖ్యం. ఈ సమయంలో ఆరోగ్య సంరక్షణ కోసం అన్ని రకాల విధివిధానాలను అవలంభించాలి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సి ఉంటుందన్నారు.

ప్రజారోగ్యంపై దృష్టిపెట్టాలి

ఉపాధి హామీ పథకాన్ని విస్తరించాలి. దీనికోసం అదనంగా మరో రూ. లక్ష కోట్లను ప్రభుత్వం కేటాయించాలి. అందరికీ అధిక పని రోజులు కేటాయించాలి. వేతనాన్ని కూడా పెంచాల్సి ఉంటుంది. ఆలస్యం లేకుండా సరైన సమయంలో నగదు చెల్లించాలి. పట్టణ ప్రాంతాల్లో కూడా సూక్ష్మ, చిన్న మధ్య తరహా సంస్థలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి పథకాన్నే ప్రవేశపెట్టాలి. ఈ నిర్ణయం ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతుందని అజీమ్ ప్రేమ్‌జీ తెలిపారు. ప్రభుత్వ పెట్టుబడులతో అందరికీ మెరుగైన ఆరోగ్యం అందిస్తూ ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలని, ప్రభుత్వం వ్యవసాయంలో అధిక పెట్టుబడులు పెట్టాలని, రైతులు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధరలను కల్పిస్తూ నాణ్యమైన కొనుగోలు విధానాన్ని తీసుకురావాలన్నారు. ఎక్కువ కాలం మన్నిక లేని వ్యవసాయ ఉత్పత్తుల విస్తరణను, నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి. గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ స్థానికంగా ఉండే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలన్నారు.

ప్యాకేజీతో పాటు ప్రణాళిక ముఖ్యం…

వలస కార్మికులకు ఉన్న చోటే పని దొరికే వెసులుబాటు ఇవ్వాలి. లేదంటే, సొంత ఊర్లకు వెళ్లడం విషయంలో వారి నిర్ణయాన్ని గౌరవించాలి. అంతేకాకుండా బస్సులు, రైళ్లలో వారిని ఉచితంగానే సొంత ఊర్లకు చేర్చాలి. ఈ పనులన్నీ కంటోన్మెంట్ నిబంధనలను పాటిస్తూనే అమలు చేసే విధంగా ప్రభుత్వం చూసుకోవాలి. కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడంతో ఆగిపోకుండా దాన్ని ఎలా వినియోగించుకుంటారనే దానిపై కనీసం రెండేళ్ల ప్రణాళికను రూపొందించాలి. దీనికోసం నిపుణుల సేవలను ఉపయోగించుకోవాలి. ప్రజలతో పాటు ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఈ చర్యలు అవసరం.

నెలకు రూ. 7వేలు ఇవ్వండి

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు 6నెలల వరకు ఉచిత రేషన్ అందించాలని అజీమ్ ప్రేమ్‌జీ సూచించారు. ఈ రేషన్‌లో బియ్యం, ఉప్పు, పప్పు సహా శానిటరీ ప్యాడ్, సోప్ కూడా ఉండాలన్నారు. వాటిని ప్రజల ఇంటి వద్దకే డెలివరీ చేసే ఏర్పాట్లు చూడాలి. ఒక్కో కుటుంబానికి కనీసం మూడు నెలల వరకు రూ. 7,000 చొప్పున అత్యవసర నిధి కింద అందించాలి. దీనికి బయోమెట్రిక్ విధానం లేని ప్రక్రియను అనుసరించాలి. పట్టణాల్లోని పేద ప్రజలకు నెలకు కనీసం 25 రోజుల పని దినాలను కల్పిస్తూ… లాక్‌డౌన్ తర్వాత కూడా మరో రెండు నెలల పాటు దీనిని కొనసాగించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు.



Next Story