సెమీ కండక్టర్ల కొరతతో దెబ్బతిన్న వాహన అమ్మకాలు

by  |
Auto industry
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకవైపు పండుగ సీజన్ సందర్భంగా అమ్మకాలపై ఆశలు పెట్టుకున్న వాహన తయారీ కంపెనీలు సెప్టెంబర్‌లో సెమీ కండక్టర్లు, చిప్‌ల కొరత దెబ్బతీసింది. ఆటో పరిశ్రమలోని దాదాపు అన్ని కంపెనీలు సెప్టెంబర్ నెల అమ్మకాల్లో క్షీణతను చూశాయి. ముఖ్యంగా దేశీయ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకి సహా హ్యూండాయ్, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్ కంపెనీలు విక్రయాలను కోల్పోయాయి. సమీక్షించిన నెలలో మారుతీ సుజుకి సంస్థ అమ్మకాలు 46.16 శాతం పడిపోయి 86,380 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో కంపెనీ 1,60,442 యూనిట్లను విక్రయించింది. దేశీయ అమ్మకాలు 54.9 శాతం తగ్గిపోగా, ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత కారణంగానే విక్రయాలు తగ్గాయని కంపెనీ వెల్లడించింది.

అయితే, ఎగుమతులు రెండు రెట్లు పెరిగి 17,565 యూనిట్లకు చేరుకున్నాయి. దేశీయ రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యూండాయ్ మోటార్ ఇండియా అమ్మకాలు 23.6 శాతం క్షీణించి 45,791 యూనిట్లుగా నమోదు చేసింది. ఎగుమతులు స్వల్పంగా పెరిగాయని కంపెనీ తెలిపింది. మహీంద్రా సంస్థ సెప్టెంబర్ నెలలో మొత్తం 13,134 యూనిట్లను విక్రయించగా, ఇది గతేడాదితో పోలిస్తే 7 శాతం తగ్గింది. ట్రాక్టర్ విక్రయాలు కూడా 8.08 శాతం పడిపోయాయని కంపెనీ తెలిపింది. టాటా మోటార్స్ సైతం 25,730 యూనిట్ల అమ్మకాలతో 8.16 శాతం క్షీణించాయని వెల్లడించింది. కమర్షియల్ వాహనాల విక్రయాలు మాత్రం 11.6 శాతం పెరిగాయని కంపెనీ పేర్కొంది. అశోక్ లేలాండ్ అమ్మకాలు ఆగస్టుతో పోలిస్తే స్వల్పంగా 1.8 శాతం పెరిగి 9.553 యూనిట్లకు చేరుకున్నాయి. బజాజ్ ఆటో అమ్మకాలు 16 శాతం తగ్గి 1,92,348 యూనిట్లను విక్రయించింది. టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు 6 శాతం పెరిగి 3,47,156 యూనిట్లుగా నమోదయ్యాయి. కియా మోటార్ ఇండియా సెప్టెంబర్‌లో 22.67 శాతం క్షీణతతో మొత్తం 14,441 యూనిట్లను విక్రయించినట్టు వెల్లడించింది. హోండా సంస్థ 6,765 యూనిట్లను విక్రయించింది. ఇది గతేడాదితో పోలిస్తే 33.66 శాతం క్షీణించాయి.



Next Story

Most Viewed