మైనర్‌పై అత్యాచార యత్నం.. కాపాడిన ఆటోడ్రైవర్‌ను అభినందించిన సీపీ

by  |
CP Anjanikumar
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: అర్ధరాత్రి వేళ ఆటో డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసిన ఓ పాత నేరస్థుడు కటకటాల పాలయ్యాడు. దీంతో ఆటోడ్రైవర్‌ను నగర పోలీస్ కమిషనర్ ప్రశంసించాడు. ఈ సంఘటన అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీపీ అంజనీకుమార్ బుధవారం తన కార్యాలయంలో జాయింట్ సీపీ విశ్వ ప్రసాద్, అబిడ్స్ ఇన్స్ పెక్టర్ ప్రసాదరావులతో కలిసి కేసు వివరాలు మీడియాతో వెల్లడించారు. మియాపూర్ న్యూ హఫీజ్‌పేట్‌కు చెందిన మహ్మద్ రిజ్వానా బేగానికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ప్రతిరోజూ కూతుళ్లతో కలిసి నాంపల్లి యుసేఫియన్ దర్గా వద్ద యాచించి వచ్చిన మొత్తంతో కూతుళ్లను పోషించుకుంటోంది. ఈ నేపథ్యంలో మంగళవారం నాంపల్లికి వచ్చిన అనంతరం అబిడ్స్ జీపీఓ సమీపంలో ఫుట్ పాత్‌పై నివాసముండే తన సోదరుడు మహ్మద్ బిన్ యమానిని కలవడానికి వచ్చింది.

సోదరుడితో మాట్లాడే క్రమంలో ఆలస్యం కావడం, హఫీజ్ పేట్‌కు వెళ్లేందుకు చివరి రైలు మిస్ కావడంతో రాత్రి పిల్లలతో పాటు తన సోదరుడితో కలిసి అబిడ్స్‌లోని ఫుట్‌పాత్‌పైనే పడుకుంది. అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో షాహినాయత్ గంజ్ ప్రాంతానికి చెందిన పాత నేరస్థుడు మహ్మద్ చోటు(41) అక్కడికి చేరుకుని నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిని అక్కడే ఉన్న సయ్యద్ జాహెద్ అనే ఆటో డ్రైవర్ గమనించి రిజ్వానాను, ఆమె సోదరుడు యమానిని నిద్రలేపి అప్రమత్తం చేశాడు. దీంతో వారు నిద్రలేచి పాత నేరస్థుడు చోటుతో గొడవ పడ్డారు. ఈ తతంగాన్ని పెట్రోలింగ్ పోలీసులు గమనించి నిందితుడు చోటును అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించారు.

బాలికపై అసభ్యంగా ప్రవర్తించినట్లు తేలడంతో అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 16 కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా అర్ధరాత్రి వేళ అప్రమత్తంగా వ్యవహరించి ఓ బాలిక అత్యాచారానికి గురి కాకుండా కాపాడిన ఆటో డ్రైవర్ జాహెద్‌ను నగర సీపీ అంజనీకుమార్ అభినందించారు. ఈ మేరకు కార్యాలయానికి పిలిపించి సత్కరించారు. సకాలంలో స్పందించిన అబిడ్స్ పోలీసులనూ ఆయన ప్రశంసించారు.

Next Story