విస్తరణ కోసం నిధులను సమీకరించనున్న ఆథర్ ఎనర్జీ

by  |
విస్తరణ కోసం నిధులను సమీకరించనున్న ఆథర్ ఎనర్జీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఆథర్ ఎనర్జీ 2022 నాటికి నిర్వహణ స్థాయిలో లాభదాయకంగా మారనున్నట్టు తెలిపింది. భవిష్యత్తులో వ్యాపార విస్తరణకు నిధులను సమకూర్చేందుకు మూలధనాన్ని సమీకరించాలని భావిస్తున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. రానున్నరోజుల్లో మరిన్ని వేరియంట్లను తీసుకొచ్చేందుకు, మాస్ మార్కెట్‌గా ఉన్న ఎలక్ట్రిక్ టూ-వీలర్ వాహన విభాగంలో వృద్ధి కోసం తన ‘450 ప్లాట్‌ఫామ్’ను ఉపయోగించుకోవాలని కంపెనీ భావిస్తోంది. మార్చి త్రైమాసికంలో ఆథర్ ఎనర్జీ అత్యంత విజయవంతంగా కొనసాగింది. ఈ త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు దాదాపు రెండున్నర రెట్లు పెరిగాయి. మొత్తం వ్యయ నిర్మాణం, అసెంబుల్, విడిభాగాల వ్యయం అన్నీ తగ్గాయి. మరీ ముఖ్యంగా సానుకూల మార్జిన్లను సాధించామని కంపెనీ వివరించింది.

గడిచిన ఒకటి, ఒకటిన్నర సంవత్సర కాలం తర్వాత అమ్మకాలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ప్రస్తుతం విక్రయిస్తున్న ప్రతి వాహనానికి సానుకూల మార్జిన్‌ను అందుకుంటున్నట్టు కంపెనీ తెలిపింది. ‘ఇప్పటికీ లాభదాయకంగా ఉన్నామని భావించడం లేదు. అయితే, పెరుగుతున్న అమ్మకాల నేపథ్యంలో మెరుగైన స్థాయిలోనే కొనసాగుతున్నామనే నమ్మకం ఉందని’ ఆథర్ ఎనర్జీ సీఈఓ, సహ-వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా చెప్పారు. లాభదాయకంగా మారేందుకు ఇంకా సమయం ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని నిధులను సేకరిస్తామని తరుణ్ చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహా 15 రాష్ట్రాల్లోని 27 నగాల్లో ఆథర్ ఎనర్జీ డెలివరీలను నిర్వహిస్తోందని, 2021 చివరి నాటికి 40 నగరాలకు విస్తరించే అవకాశం ఉందని తరుణ్ మెహతా వెల్లడించారు.



Next Story