‘చారిత్రక కట్టడాలను ఎవరైనా కూల్చివేస్తారా’?

by  |
‘చారిత్రక కట్టడాలను ఎవరైనా కూల్చివేస్తారా’?
X

దిశ ఏపీ బ్యూరో: చారిత్రక విజయనగరంలో మూడు లాంతర్లను కూల్చేడయం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అభివృద్ధి, కొత్త స్థూపం ఏర్పాటు పేరిట చారిత్రక స్థూపాన్ని కూల్చడం పట్ల స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. విజయనగరంలోని రాజు గారి కోట, గంటస్థంభం, సంగీత కళాశాల, మూడు లాంతర్లు, పైడితల్లమ్మ గుడి, పెద్ద చెరువు ఎంతో ప్రాముఖ్యత గలవి.

1860 ప్రాంతంలో విజయనగరంలో పైడితల్లమ్మ గుడి పరిసరాల్లో రద్దీని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన కూడలిలో మూడు లాంతర్లు ఏర్పాటు చేశారు. అనంతర కాలంలో దేశ చిహ్నమైన నాలుగు సింహాలను స్థూపాన్ని ఏర్పాటు చేశారు. మూడు లాంతర్ల జంక్షన్ అంటే పట్టణంలో ఎవరైనా చూపిస్తారు. అలాంటి మూడు లాంతర్లను అభివృద్ధి పేరిట కూల్చేశారు. దీనిపై టీడీపీ నేత, విజయనగర సంస్థానాధీశుడు అశోక్ గజపతి రాజు స్పందిస్తూ, మూడు లాంతర్ల స్తంభాన్ని కూల్చివేయడం బాధాకరమని అన్నారు.

ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన కట్టడం కూల్చివేత పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న స్థూపాన్ని కూల్చడం ద్వారా జాతీయ చిహ్నాన్ని సైతం అధికారులు అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యలను అందరూ ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. పరిస్థితి చూస్తుంటే భవిష్యత్తులో ఇంకా చాలా చారిత్రక కట్టడాలు కూల్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

దీనిపై విజయనగరం పౌరులతో కలిసి శాంతియుత పద్ధతిలో నిరసన తెలుపుతామని అన్నారు. కాగా, దీనిపై టీడీపీ, జగనసేన, బీజేపీ, బీఎస్పీ తదితర పార్టీలన్నీ నిరసన తెలుపుతున్నాయి. విజయనగర ప్రాముఖ్యతను తెలిపే స్థూపాలను కూల్చే పని బుధ్ధి ఉన్న ఎవరైనా చేపడతారా? అని వారు ప్రశ్నించారు.

Next Story

Most Viewed