అమ్మ ఒక్కసారి లేవవూ..!

by  |
అమ్మ ఒక్కసారి లేవవూ..!
X

పాట్నా: బతకడానికి వలసలు పోవడం, కరోనా రాకాసి రంగప్రవేశం చేయడం, లాక్‌డౌన్‌తో ఊపిరాడకపోవడం, కళ్లల్లో సొంతూరు మెదలడం ఇవేవీ ఆ బుడతడికి తెలియదు. అమ్మ ఒళ్లో ఒదిగి పడుకుంటే చాలు. మరేమీ అక్కర్లేదు. కానీ, తనతో కాసేపు ఆడుకునే అమ్మ.. తాను అలిగితే, అల్లరి చేస్తే లాలించే అమ్మ ఒక్కసారిగా మూగపోయింది. ఎన్ని సార్లూ ‘భూ’ అన్న కదలడంలేదు, మెదలడం లేదు. ఆమె కప్పుకున్న చెద్దరిలోకి చొరబడినా, వదిలేసి వెళ్తున్నా అన్నట్టు అడుగులు వేసినా అమ్మ పట్టించుకోదేం? అని తికమకపడ్డాడు. ఆకలి పోరాటం, జీవన్మరణాల గురించి తెలియని ఆ పిల్లాడిని వయసులో కొంచెం పెద్ద అయిన మరో పిల్లాడు చేరదీసి అమ్మలేదని చెప్పాడు. కానీ, అమ్మలేనితనమంటే తెలియని ఆ చిన్నారి చూసిన బిత్తర చూపులు అక్కడివారందరి హృదయాలను కలచివేశాయి. ఈ ఘటన బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఆ తల్లి వలస వెళ్లిన గుజరాత్ నుంచి సొంతూరి కోసం శ్రామిక్ ట్రైన్‌లో ఆదివారం బీహార్‌లోని ముజరఫర్‌పూర్‌కు బయల్దేరింది. ఒకవైపు ఆహారం లేక అలసట, మరోవైపు ఉరుముతున్న ఎండ చివరికి ఆమెను పొట్టనబెట్టుకున్నాయి. ముజఫర్‌పూర్‌కు ట్రైన్ చేరుకుంటున్న కొన్ని క్షణాల ముందే ఆమె తన చిన్నారిని వదిలిపెట్టి శాశ్వతంగా కన్నుమూసింది. స్టేషన్‌లో ఆ శవాన్ని ఉంచగా.. తల్లి కోసం పరితపిస్తున్న ఆ చిన్నారి వీడియో ఇప్పుడు నెటిజన్లను కంటతడిపెట్టిస్తున్నది. వలస కూలీల వ్యధను కళ్లకు కడుతున్నది.



Next Story

Most Viewed