తప్పనిసరైతేనే అరెస్టులు

by  |
తప్పనిసరైతేనే అరెస్టులు
X

న్యూఢిల్లీ: కరోనా ఉధృతి తీవ్రమవుతున్న సందర్భంలో జైళ్లలో రద్దీ తగ్గించడానికి సుప్రీంకోర్టు శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏడేళ్ల జైలు శిక్ష పడే కేసుల్లో తప్పనిసరి అయితేనే నిందితులను అరెస్టులు చేయాలని, అనవసరం అరెస్టులు చేసి జైళ్లు నింపొద్దని తెలిపింది. గతేడాది కరోనా కారణంగా పెరోల్ ఇచ్చినవారికి తాజాగా మరో 90 రోజులు ఆ అవకాశాన్ని ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, ఖైదీలకు సరైన ఆరోగ్య వసతులను కల్పించి కరోనాను అదుపులో ఉంచడానికి దోహదపడాలని పేర్కొంది. రెగ్యులర్‌గా ఖైదీలకు, జైలు అధికారులకు టెస్టులు చేయాలని, పరిశుభ్రతను తప్పకుండా పాటించాలని సూచించింది. ఖైదీల మధ్య వైరస్ వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. గతేడాది కూడా కరోనా కేసులను అదుపులో ఉంచడానికి వైరస్ బారినపడే ముప్పు అధికంగానున్న ఖైదీలను గుర్తించి వేగంగా విడుదల చేయడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు హైపర్ కమిటీలే ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు గతేడాది మార్చి 23న ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఈ కమిటీల సూచనలతో గతేడాది పలురాష్ట్రాలు జైళ్లలో రద్దీ తగ్గించడానికి ఖైదీలను విడుదల చేసింది. తాజాగా, ఆ కమిటీలు మరోసారి కొత్తగా విడుదల చేయాల్సిన వారి జాబితాను రూపొందించాలని, 23 మార్చి 2020కు ముందు విడుదల చేసినవారినీ మళ్లీ విడుదల చేయాలని తెలిపింది. గతేడాది విడుదల చేసినవారినీ మళ్లీ విడుదల చేయడం ద్వారా విలువైన సమయాన్ని సేవ్ చేసుకున్నవారిమవుతామని పేర్కొంది. కొందరు ఖైదీలు తమ సామాజిక పరిస్థితుల మూలంగా విడుదలకు విముఖత చూపవచ్చునని, మరికొందరు వైరస్‌కు భయపడీ బయటకు రావడానికి తిరస్కరించవచ్చునని, అలాంటి వారి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని సరైన నిర్ణయం చేయాలని ఆదేశించింది.


Next Story

Most Viewed