పేరుకే పదవులు.. పొద్దున సర్పంచ్.. రాత్రైతే సెక్యూరిటీ గార్డు!

by  |
పేరుకే పదవులు.. పొద్దున సర్పంచ్.. రాత్రైతే సెక్యూరిటీ గార్డు!
X

దిశ, నిజామాబాద్ రూరల్ : టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో సర్పంచుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. నిధులు మంజూరు కాకపోవడంతో సర్పంచ్ గ్రామం కోసం తన సొంత పొలాన్ని అమ్ముకుంటూ ఉదయం పూట సర్పంచ్ కుర్చీలో.. రాత్రివేళ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరి పరిస్థితి, దయనీయతను చూస్తుంటే గ్రామస్తులు సైతం అయ్యో పాపం అంటున్నారు.

వివరాల్లోకెళితే.. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన బండి ఇరుసు మల్లేష్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈసారి సర్పంచ్ సీటు ఎస్సీకి రిజర్వు కావడంతో ఎక్కువమంది పోటీలో నిలిచారు. దీంతో ఎస్సీ కులస్తులు, గ్రామస్తులు సర్పంచ్ అభ్యర్థులు అందరి పేర్లను రాసి చిటీలు తీయగా ఇరుసు మల్లేష్ సర్పంచ్ అభ్యర్థిగా ఖరారు చేశారు. అయితే, నాలుగో విడత పల్లె ప్రగతిలో భాగంగా గతంలో గ్రామంలో చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు అలానే ఉండిపోయాయి. చివరికు సర్పంచ్ అప్పుల పాలై తనకున్న రెండెకరాల్లో అరఎకరం భూమిని అమ్ముకుని అప్పులన్నీ తీర్చేశాడు. టీఆర్ఎస్ పాలనలో సర్పంచ్‌లకు గౌరవ వేతనంగా ఇచ్చే ఐదువేల రూపాయలు సైతం నెలనెలా ఇవ్వకపోవడంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. దీంతో ఆరెపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ ఇరుసు మల్లేష్ చివరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అశోక్ టవర్స్‌లో రాత్రి వాచ్‌మెన్ విధుల్లో చేరాడు. ఉదయం పూట సర్పంచ్‌గా గ్రామంలో సేవలందిస్తూ ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పన చూసుకుంటున్నాడు.

గతంలో ఆరెపల్లి గ్రామం బర్దీపూర్ గ్రామంలో కలిసి ఉండేది. 2018 సర్పంచ్ ఎన్నికల్లో ఆరెపల్లి గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ప్రకటించారు. దీంతో ప్రస్తుతం గ్రామ జనాభా 434 కాగా, గ్రామానికి నెలసరి ఎస్ఎఫ్‌సీ నిధులు రూ.37 వేల రూపాయలు జనాభా ప్రాతిపదికన వస్తాయని తెలిపారు. అయితే, గ్రామంలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు, నాలుగో విడత పల్లెప్రగతి కోసం చేపట్టే పనులకు పెండింగ్ బిల్లులు రాకపోవడంతో పాటు మంజూరైన కొద్దిపాటి నిధులు కరెంటు బిల్లులు, గ్రామ పంచాయతీ సిబ్బందికి నెలసరి జీతాలు ఇవ్వడంతోనే సరిపోతోందని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు.

తన కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో తనకున్న రెండెకరాల పొలంలో అరెకరం పొలం అమ్మేసి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు చెల్లించాల్సిన డబ్బును చెల్లించారు. జిల్లా కలెక్టర్‌కు ఈ విషయంపై విన్నవించగా గ్రామానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు సర్పంచ్, కార్యదర్శులు పేర్కొన్నారు. కానీ ఇచ్చిన హామీ మాటలకే పరిమితమైందని, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రాలేదని సర్పంచ్ వాపోయారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు కూడా గ్రామ పరిస్థితిపై వివరించగా ఆయన కూడా స్పందించలేదు. దీంతో తానే తన పొలం అమ్మేసి బిల్లులు చెల్లించి, కుటుంబాన్ని పోషించుకోవడానికి రాత్రుళ్లు సెక్యూరిటీ గార్డు జాబ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.



Next Story

Most Viewed