కాకతీయుల కాలం నాటి ఆలయాలకు మహర్దశ..

by  |
కాకతీయుల కాలం నాటి ఆలయాలకు మహర్దశ..
X

దిశ, ఖానాపూర్ : ఉమ్మడి వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ధర్మరావుపేట శివారులో గల త్రిలింగ త్రికూట త్రి నేత్రాలయానికి త్వరలో మహర్దశ పట్టనుంది. పురావస్తు శాఖ అధికారి మల్లు నాయక్, పురావస్తు శాఖ పరిశోధకులు శివనాగిరెడ్డి ( ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ) త్రిలింగ త్రి కూటాలయాన్ని మంగళవారం సందర్శించారు.

ఆలయ చరిత్ర, వాస్తు, శిల్పాలని వారు పరిశీలించారు. ఆలయంలో ఉన్న శాసనాన్ని అక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులైన సర్పంచ్ శృతి, ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, జడ్పీటీసీ స్వప్న శ్రీనివాస్, ఎంపీటీసీ విజాకర్ రావులకు చదివి వినిపించారు. శాసనం ప్రకారం ఈ ఆలయం గణపతి దేవుడు కాలానికి చెందినదన్నారు. ఈ ఆలయాన్ని గణపతి దేవుని మంత్రి రుద్రుడి మనుమడు స్వామి తన తండ్రి అప్పయ్య పేరు మీద అప్పంబుధి అనే చెరువును, అప్పేశ్వర మహాదేవ, రుద్రేశ్వర ఆలయాలను నిర్మించినట్లు శాసనంలో ఉందన్నారు.

కాకతీయుల వాస్తు శైలిలో నిర్మించిన ఈ ఆలయం ప్రవేశ మండపం, మహిషాసుర మర్దిని ఆలయం 16 స్తంభాల రంగ మండపం, నాలుగు స్తంభాల కళ్యాణమండపం, రోడ్డు పక్కనే ఉన్న ధర్మరాయుని గుడి శిథిలమై ఉన్నాయని, పునాదులు కుంగి గోడలు పడిపోయాయన్నారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన 800 ఏళ్ల నాటి ఈ ఆలయాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని అధికారులు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారు వారసత్వ కట్టడాల పరిరక్షణకై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామంలోని ఆలయాలన్నింటినీ అభివృద్ధి పరిస్తే గొప్ప ఆధ్యాత్మిక దర్శనీయ క్షేత్రంగా విలసిల్లుతోందన్నారు. తద్వారా అభివృద్ధి కూడా సాధ్యమవుతుందని ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు అన్నారు.కార్యక్రమంలో గ్రామస్తులు ప్రభాకర్ రావు, నర్సిరెడ్డి, బిచ్చ నాయక్, సుధన్ రెడ్డి, శ్యాంసుందర్రావు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed