స్కోరింగ్, బ్యాటింగ్ ఎక్కడ..? పల్లెల్లో యధేచ్చగా గంజాయి దందా

by  |
స్కోరింగ్, బ్యాటింగ్ ఎక్కడ..? పల్లెల్లో యధేచ్చగా గంజాయి దందా
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: అది నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని ఓ గ్రామం. ఆ గ్రామంలో నిత్యం కిలోల కొద్దీ గంజాయి విక్రయాలు జరుగుతుంటాయి. అయితే ఆ గ్రామానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరం నుంచి యువత వచ్చి గంజాయి కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. ఇదంతా చేసేది నిండా పాతికేళ్లు నిండని ఓ యువకుడు. అతడికి గంజాయికి ఎక్కడి నుంచి వస్తుంది..? అతడి వెనుక ఉన్నదెవరు..? అన్న ప్రశ్నలకు ఎక్సైజ్ శాఖ అధికారులే సమాధానం చెప్పాలి. నిజానికి ఆ యువకుడు మూడు నెలల క్రితమే గంజాయి రవాణా చేస్తూ దొరికాడు. కానీ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గి.. వదిలేశారు. దీంతో ఆ యువకుడు మరింతగా రెచ్చిపోయాడు. ఫలితంగా ఆ ఒక్క గ్రామంలోని యువకులే కాదు.. చుట్టూ 30 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లోని యువతంతా గంజాయి మత్తుకు బానిసవుతుండడం గమనార్హం.

ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం అక్రమార్కుల పాలిట వరంలాగా.. యువత పాలిట పెనుశాపంగా మారింది. తెలిసి తెలియని వయస్సులో గంజాయి మత్తులో పడి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. ఏది మంచో.. ఏది చెడో తెలియని వయస్సు యువతంతా ఇప్పుడు గంజాయి జపమే చేస్తుండడం గమనార్హం. వాస్తవానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిత్యం అడపాదడపా గంజాయి కేసులు వెలుగులోకి వస్తున్నా.. ఎక్సైజ్ శాఖ మాత్రం నిద్రమత్తును వీడడం లేదు. క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు జిల్లా కేంద్రాలు, కార్యాలయాలకే పరిమితం అవుతున్నారు. ఇదే సమయంలో భారీగా దందా చేసే అక్రమార్కులు అమ్యామ్యాలు మంచిగానే ముట్టజెప్పుతున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గంజాయి మత్తులో చిత్తవుతోన్న యువతపై కథనం.

అమ్మకాలకు పల్లెలే కేంద్రంగా..

ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా గంజాయిని సేవించే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇందులో ప్రధానంగా 15 ఏండ్ల నుంచి 25 ఏండ్ల వయస్సు వారే అధికంగా ఉన్నారు. నిత్యం జిల్లాలో క్వింటాళ్లలోనే అమ్మకాలు అవుతున్నట్టు సమాచారం. నల్లగొండ జిల్లాకు గంజాయి వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి అధికంగా రవాణా జరుగుతోంది. పట్టణ ప్రాంతాల్లో గంజాయిని విక్రయిస్తే.. ఈజీగా దొరికిపోతామనే ఉద్దేశంతో అక్రమార్కులు పల్లెలను టార్గెట్ చేసుకున్నారు. వాస్తవానికి ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన గంజాయి సంస్కృతి మారుమూల పల్లెల్లోకి పాకిపోయింది. కృష్ణపట్టె ప్రాంతంలో ఏకంగా గంజాయిని సాగు చేస్తోన్న ఉదంతాలు లేకపోలేదు.

ప్రత్యేక పాస్ కోడ్‌లతో సమాచారం

గంజాయి దందాలో అక్రమార్కులు సరికొత్త ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు. పట్టణాల్లో గంజాయి విక్రయిస్తే.. ఈజీగా దొరికిపోతామనే ఉద్దేశంతో పల్లెల్లోని యువతను టార్గెట్ చేశారు. వారి ద్వారా పట్టణాలు, ఇతర ప్రాంతాల్లోని యువతకు సరఫరా చేస్తున్నారు. అయితే గంజాయి విక్రయాల కోసం ప్రత్యేక పాస్ కోడ్‌లను ఉపయోగిస్తుండడం గమనార్హం. పట్టణాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి యువకులు పల్లెల్లోకి వచ్చి గంజాయి దొరికే ప్రాంతాలను ఈజీగా తెలుసుకునేందుకు పాస్ కోడ్(స్కోరింగ్, బ్యాటింగ్ ఎక్కడ అంటూ) చెబితే.. సులువుగా సమాచారం తెలుస్తోంది. ఇదే సమయంలో వచ్చినవారు పోలీసులు కాదనే విషయాన్ని ధ్రువీకరించుకుంటున్నారు.

మత్తు వీడని ఎక్సైజ్ శాఖ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడుంబాను పూర్తిగా నిషేధించాక.. ఎక్సైజ్ శాఖ యాక్టివ్ రోల్‌ను పోషించడం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మద్యం అమ్మకాలను తప్ప మిగతా ఏ విషయాలను పట్టించుకోవడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఒక్క గంజాయి దందానే కాకుండా నిషేధిత గుట్కాలు, గుడుంబా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయి అమ్మకాలపై ఎవరైనా ఫిర్యాదు చేసినా.. పెద్దగా స్పందించడంలేదు. ఒకటికీ రెండు సార్లు వెంటపడి మరీ ఫిర్యాదు చేస్తేగానీ వారిని పట్టుకునే ప్రయత్నం చేయడంలేదు. దీనికితోడు ఒకసారి దొరికిన గంజాయి అక్రమార్కులను మూలాలను కనుక్కోవడంలోనూ ఎక్సైజ్ శాఖ విఫలమవుతోంది. దీనంతటికి కారణం.. జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారులు కేవలం జిల్లా కేంద్రాలకే పరిమితం అవుతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే వాస్తవాలను వారు గ్రహించలేకపోతున్నారు. ఇప్పటికైనా మత్తు వీడి క్షేత్రస్థాయిలో జరిగి అక్రమాలపై దృష్టి సారిస్తుందా.. లేదా.. అన్నది వేచిచూడాల్సిందే.

Next Story

Most Viewed