ఏపీ కొత్త లడాయి.. ప్రేమగా వితండవాదం

by  |
ఏపీ కొత్త లడాయి.. ప్రేమగా వితండవాదం
X

దిశ, న్యూస్ బ్యూరో: మౌనంగా ఉంటే తల మీదికెక్కుతోంది ఏపీ ప్రభుత్వం. కృష్ణా జలాల అంశంలో వితండవాదానికి దిగుతోంది. ఉమ్మడి ప్రాజెక్టు అయిన నాగార్జునసాగర్‌కు చేరిన నీళ్లన్నింటినీ తెలంగాణ వాటా లోనే వేయాలని కొత్త నాటకానికి తెర లేపింది. ఇప్పటికే కృష్ణా జలాలను లెక్కకు మించి తరలించుకుపోతూ ఉత్తుత్తి లెక్కలు చూపే ఏపీ ప్రభుత్వం ఈసారి తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్తు కేంద్రాన్ని కొనసాగిస్తుంటే తట్టుకోలేక గింజుకుంటోంది. పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు సాధ్యం కాకపోవడంతో అసహనాన్ని వెళ్లగక్కుతోంది. వాస్తవానికి నాగార్జునసాగర్ ఆయకట్టు ఆంధ్రప్రదేశ్‌కే ఎక్కువ ఉంటుంది. ఈ లెక్కలన్నీ మరిచి కొత్త వాదనకు దిగుతోంది. కృష్ణా బోర్డు చేయాల్సిన పనిని కూడా ఏపీ ప్రభుత్వమే మీదేసుకుంటోంది.

నీటివాటాను కూడా మేమే తేల్చుతామని ధోరణితో తిరకాసు పెడుతోంది. ఉమ్మడి ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి ఎడమగట్టు విద్యుత్తు కేంద్రం ద్వారా వెళ్లిన నీళ్లన్నీ తెలంగాణ వాటాలో లెక్కించాలని బోర్డుకు లేఖ రా సింది. పోతిరెడ్డిపాడుకు నీళ్లందలేదనే అక్కసును బయట పెట్టుకుంది. కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణకు సరైన కార్యాచరణ లేకపోవడం, వినియోగించుకునే స్థాయిలో ప్రాజెక్టులు లేకపోవడంతో ఏపీ అవకాశంగా తీసుకుంటోందని నీటిపారుదల శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. పలు కారణాలతో తెలంగాణ సహనం పాటిస్తుంటే ఏపీ చేతికానితనంగా తీసుకుంటోందని మండిపడుతున్నారు.

లేఖ మీద లేఖ

ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి మంగళవారం రాత్రి కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు ద్వారా తెలంగాణ కరెంట్ ఉత్పత్తిని చేస్తోందని, దీంతో సాగర్‌కు నీళ్లు తరలిపోతున్నాయని గతంలోనే లేఖ రాశారు. తాజాగా రాసిన లేఖలోనూ ఆశ్చర్యకర అంశాలు ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు ఈ నెల ఒకటి నాటికి 106.160 టీఎంసీల వరద వచ్చిందని, అందులో తెలంగాణ వాటా 34 శాతం అని, ప్రస్తుత జలాల లెక్కల ప్రకారం తెలంగాణ వాటా ప్రకారం 36.100 టీఎంసీలను కేటాయించాలని లేఖలో పేర్కొనడం విస్మయానికి గురి చేస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య నీళ్ల పంపిణీ చేయాల్సిన బోర్డు బాధ్యతలను ఏపీ ప్రభుత్వమే మీదేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. శ్రీశైలం ఎడమగట్టు నుంచి 36 టీఎంసీలను సాగర్‌కు తరలించారని, ఇప్పుడు విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేయాలనీ లేఖలో రాశారు. వాస్తవానికి రెండు రాష్ట్రాల మధ్య జలాల వాటా కృష్ణా బేసిన్‌లోని ఇతర ప్రాజెక్టుల ఆధారంగా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. కేవలం శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చిన వరదలోనే వాటాలు వేయడం, అదే సమయంలో వాటా మేరకు కరెంట్ ఉత్పత్తిని చేసుకోవాలనడం, దీని ప్రకారం ఇప్పటికే తెలంగాణ వాటా పూర్తి అయిందని చెప్పడం సరి కాదని నీటిపారుదల శాఖ నిపుణులు చెబుతున్నారు.

పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించకుండా తెలంగాణ ప్రభుత్వం సాగర్‌కు నీటిని తరలించిందనే అక్కసుతోనే ఈ వాదనకు దిగిందని స్పష్టమవుతోంది. పోతిరెడ్డిపాడుపై ఉన్న ప్రేమతో నాగార్జున సాగర్‌కు తరలించిన నీటిలో ఏపీ తమకు కూడా వాటా ఉందనే విషయాన్ని పట్టించుకోవడం లేదని పేర్కొం టున్నారు. నీటి లభ్యత ఉన్నప్పుడు కరెంట్ ఉత్పత్తి చేయడంలో తప్పులేదని అంటున్నారు. సాగర్‌కు నీళ్లిస్తే గగ్గోలు పెడుతున్న ఏపీ, సాగర్ ఆయకట్టును ఎండబెట్టి పోతిరెడ్డిపాడు ద్వారా గతంలో మాదిరిగా లెక్కలు చూపకుండా వేలాది క్యూసెక్కుల నీటిని మళ్లించుకోవాలనే దురుద్దేశ్యంతోనే తెలంగాణపై వరుసగా ఫిర్యాదులు చేస్తుందని వివరిస్తున్నారు. కృష్ణా బోర్డు కూడా ఏపీకే వత్తాసు పలుకుతున్నట్లుగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. ఏపీ లేఖ రాసినప్పుడల్లా తెలంగాణకు లేఖ రాయడం, విద్యుత్ ప్రాజెక్టును ఆపాలనడం కూడా సరికాదంటున్నారు. బోర్డు పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed