అర్హులైన అందరికీ పక్కా ఇళ్లు : జగన్

by  |
అర్హులైన అందరికీ పక్కా ఇళ్లు : జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం ‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు’ పథకం ప్రారంభించారు. ఈ సంరద్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్ల పండుగ జరుగుతోందని తెలిపారు. ఈ ఇళ్ల పట్టాలను నిరంతర ప్రక్రియగా మార్చామని.. అర్హులైనవారు దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో.. ఇంటి స్థలం కేటాయించేలా ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ సహా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్థల విస్తీర్ణం బట్టి పార్క్‌లు, అంగన్‌వాడీలు, విలేజ్‌ క్లీనిక్‌లు, ఆర్‌బీకేలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతేగాకుండా 224 చదరపు అడుగుల నుంచి 340 చదరపు అడుగులకు విస్తీర్ణం పెంచామన్నారు.

ఈ మొత్తం టిడ్కో ఇళ్లు పూర్తి చేయడానికి రూ.9వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీలో కులం, మతం, పార్టీ వంటి బేధాలు చూడలేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటిని అందిస్తున్నామని తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు ఇచ్చామని, మొదటి ఆప్షన్‌లో నిర్మాణ సామాగ్రి, లేబర్ ఛార్జీలను లబ్ధిదారులకు ఇస్తామని వెల్లడించారు. డిసెంబర్‌ 25న ఇళ్ల పట్టాలు పంచుతామని తెలిసి 24న ప్రతిపక్ష పార్టీలు కోర్టుకు వెళ్లారని, దీనిని బట్టి చంద్రబాబు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో దీన్ని బట్టే తెలుస్తుందని జగన్‌ మండిపడ్డారు. ప్రభుత్వ భూములను కూడా పేదలకు కేటాయించకుండా అడ్డుకుంటున్నారు. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం కాగానే మిగిలిన వారందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed