రెండోరోజూ కొనసాగిన ఆందోళన.. రంగంలోకి ఈటల

by  |
Anxiety continued
X

దిశ, హుజూరాబాద్, హుజురాబాద్ రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన రాజేశ్వరి మృతదేహంతో తెల్లవారుజాము వరకూ ఆందోళన కొనసాగించారు. సోమవారం సాయంత్రం రాజేశ్వరి మృతదేహాన్ని హుజురాబాద్‌కు తరలించగా ఆమె బంధువులు ఆందోళన చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ వారికి మద్దతుగా నిలిచాడు. వారితో పాటు నిరసనలో పాల్గొని ఆందోళన చేయడంతో పోలీసులు తెల్లవారుజామున 2 గంటల వరకూ బందోబస్తు నిర్వహించారు.

 Anxiety continued

చివరకు నాటకీయ పరిణామాల మధ్య మృతదేహాన్ని పోలీసులు తెల్లవారుజామున మార్చురీకి తరలించారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో తోపులాట జరిగింది. ఎంతకూ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీచార్జీ చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బల్మూరి వెంకట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆందోళనలో బల్మూరి వెంకట్ స్పృహ తప్పడంతో ముందుగా ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం క్షతగాత్రులను పరామర్శించి ఆదుకుంటామని చెప్పిన మంత్రి గంగుల కమలాకర్ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకూ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తీసుకెళ్లేది లేదని మొండికేయడంతో సర్పంచ్ భర్త అక్కడి నుండి వెల్లిపోయారు.

రెండోరోజూ కొనసాగిన ఆందోళన

అయితే, పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి మంగళవారం తెల్లవారు జామున రాజేశ్వరి మృతదేహానికి పోస్టుమార్టానికి తరలించారు. దీంతో బాధితురాలి బంధువులు ఇంటివద్దే మధ్యాహ్నం వరకు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ ఇందిరానగర్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం, నాటి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి రూ.10 లక్షల సాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం ఇందిరానగర్ సర్పంచ్ భర్త ప్రవీణ్ మరోసారి బాధితుల ఇంటికి చేరుకుని ఆందోళన కారులతో చర్చలు జరిపారు. రాజేశ్వరి కుటుంబానికి రూ.7 లక్షలు ఇస్తామని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగం ఇప్పించడంతో పాటు గాయపడ్డ వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు విరమించారు.

రంగంలోకి ఈటల రాజేందర్

విషయం తెలుసుకున్న హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాయకులను కొనేందుకు రూ.కోట్లు వెచ్చించడానికి డబ్బు ఉంది కానీ, బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేదని మండిపడ్డారు. నిరుపేద మహిళ ప్రమాదంలో చనిపోతే ఆదుకోవడానికి చేతులు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వడం లేదని ఈటల ఆరోపించారు. గతంలో మరణించిన మహిళ కుటుంబానికి కూడా ఆర్థికసాయం చేయలేదని విమర్శించారు.



Next Story

Most Viewed