కేసీఆర్‌కు మరో షాక్.. కరీంనగర్ సీనియర్ నేత రాజీనామా

by  |
Ravindar sing
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఉద్యమ ప్రస్థానం నుండి వెన్నుదన్నుగా నిలిచిన నాకు మీరు పలుమార్లు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని చెప్పి మాట తప్పారని రాజీనామా లేఖలో సీఎం కేసీఆర్‌కు వివరించారు. లోకసభ ఎన్నికల బరిలో మీరు పోటీ చేసిన సమయంలో బీజేపీకి రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకున్నానని, అయితే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాని ప్రకటించారు.

సర్దార్ రవీందర్ సింగ్ రాజీనామా సంపూర్ణ పాఠం

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి నమస్కరించి బాధాతప్త హృదయంతో రాస్తున్న నాయొక్క రాజీనామా పత్రం.

తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని మీ పిలుపును అందుకొని నేను భారతీయ జనతా పార్టీ, కరీంనగర్ నగర శాఖ అధ్యక్షుడిగా రాజీనామా చేసి మీ సమక్షంలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరి అప్పుడు జరుగుతున్న మీ పార్లమెంటు ఎన్నికలలో మీ గెలుపు కోసం పని చేయడం జరిగింది. నేను టీఆర్ఎస్ పార్టీలో చేరిన నుండి ఉద్యమ వ్యాప్తి కోసం మీ అడుగులో అడుగు వేసి మీరు ఏ పిలుపు ఇచ్చిన దాన్ని కరీంనగర్ నగరంలో అమలుపరిచి తెలంగాణ ఉద్యమాన్ని టీఆర్ఎస్ పార్టీని సమాంతరంగా ముందుకు తీసుకుపోవడం కోసం ఆరోజు నుండి ఈరోజు వరకు పని చేయడం జరిగింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా మీరు ఏ పిలుపు ఇచ్చినా దానిని అమలు చేయడం కోసం చిత్తశుద్ధితో పనిచేశాను. ఆ సందర్భాలలో మీరే నాకు స్వయంగా ఎంఎల్సీగా అవకాశం ఇస్తానని వాగ్దానం చేశారు. ఇలా ఒకసారి కాదు.. చాలాసార్లు మాట ఇచ్చారు. మీ మాటలు నమ్మి నేను పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి సిద్ధపడితే మీరు గౌరవ స్వామిగౌడ్ గారికి అవకాశం ఇచ్చారు. మీ నిర్ణయాన్ని గౌరవించి వారి గెలుపు కోసం పనిచేశాను. వారి పదవి కాలం పూర్తి అయిన తర్వాత కూడా నాకు అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చి వేరే ఒకరికి అవకాశం ఇచ్చారు. అప్పటికి కూడా మీ నిర్ణయాన్ని గౌరవించి పార్టీ ఎదుగుదల కోసం పని చేశాను.

మీరే స్వయంగా రవీందర్ సింగ్‌కు స్థానిక సంస్థలలో 25సం॥ల అనుభవం ఉంది. ఇక నీకు ఎం.ఎల్.సి. గా అవకాశం ఇస్తానని జిల్లా ప్రజాప్రతినిధుల సాక్షిగా మాట ఇచ్చారు. కానీ నేటికి మీ మాట నిలబెట్టుకోలేకపోయారు. కనీసం మీరు ఇచ్చిన మాట మీకు గుర్తుం చేద్దాం అని మీ సమయం కోరితే కలవడానికి కూడా మీరు సమయం ఇవ్వడం లేదు.

కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కాని జిల్లాలో కొందరు నాయకుల వ్యవహార శైలికాని మీకు వివరించాలనుకుంటే మీరు సమయం ఇవ్వడం లేదు. టీఆర్ఎస్ పార్టీ కొందరు ఉద్యమ ద్రోహుల చేతులో బందీ అయింది. మీరు తెలంగాణ ఉద్యమంలో లేని వారిని, అసలు ఒక్క రోజు కూడా జై తెలంగాణ అని నినాదం చేయని వారిని, మీ పక్కకు చేర్చుకొని కరీంనగర్‌లో పార్టీని భ్రష్టు పట్టించిన కూడా మీరు వారిని పల్లెత్తు మాట అనకుండా ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా, ఎన్ని రకాల ఆరోపణలు కథనాలుగా టీవీల్లో, పేపర్‌లో వచ్చినా మీరు పట్టించుకోకపోవడం.. అలాంటి వారిని మీ పక్కకు చేర్చుకొని, అసలుసిసలైన తెలంగాణ ఉద్యమకారులను దూరం చేసుకుంటున్నారు. మనకు అధికారం రాకముందు తెలంగాణ ఉద్యమకారులను మీరు ఏ విధంగా గౌరవించేవారో మీకు అధికారం వచ్చి ముఖ్యమంత్రి అయిన తరువాత ఉద్యమకారుల పరిస్థితి ఏమిటో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఉద్యమకారులు పరిస్థితి చూసి బాధ కలిగి కన్నీళ్లు వచ్చిన తెలంగాణ అభివృద్ధి కోసం అని ఓపికతో సహించి ఉన్నాము.

తెలంగాణ ఉద్యమ ద్రోహులను అధికారంలో అందలమెక్కిస్తూ తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన వారందరిని అవమానాలకు గురిచేస్తూ వారికెలాంటి అవకాశాలు ఇవ్వకుండా పార్టీ కండువాలు కప్పుకున్నదే తడువుగా మీరు వారికి అవకాశాలు కల్పిస్తూ తెలంగాణ ఉద్యమకారులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడాన్ని భరించలేకపోతున్నాం. టీఆర్ఎస్ పార్టీని కూడా కొందరి ఉద్యము ద్రోహుల చేతులో పెట్టి వారు చేసిందే శాసనం అన్నట్టుగా కరీంనగర్ జిల్లాలో వ్యవహరిస్తే కూడా మీ నుండి చర్యలు లేక టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వారి జేబు సంస్థగా మారడం చూస్తుంటే ఇక టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులకు నిజమైన కార్యకర్తలకు స్థానం లేదని గ్రహించి పార్టీకి రాజీనామా చేస్తున్నాను.

మీరు ఇప్పటివరకు నాపై చూపించిన ప్రేమకుకృతజ్ఞతాభివందనాలతో..

సర్దార్ రవీందర్ సింగ్, మాజీ మేయర్, కరీంనగర్ నగరపాలక సంస్థ

111

222

Next Story

Most Viewed