తెలంగాణ ప్రభుత్వానికి మరో ఆదాయం.. ఎక్సైజ్ శాఖతో పోటీపడేలా కేసీఆర్ ప్లాన్

by  |
Cm KCR 2
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ఖజానాను నింపుకునేందుకు మద్యంతో పాటు రిజిస్ట్రేషన్లపై ఆధారపడుతోంది. రెండింటి ఆదాయాన్ని పోటీ పడేటట్లు చేస్తోంది. ఒక దానికి మించి మరొకటి ఖజానాకు కాసులను నింపేటట్లుగా వ్యూహరచన చేసింది. భూముల మార్కెట్/రిజిస్ట్రేషన్ విలువల పెంపు ప్రక్రియను ఒకటీ రెండు రోజుల్లోనే పూర్తి చేయనుంది. శనివారం 33 జిల్లాల్లో కలెక్టర్ నేతృత్వంలో రిజిస్ట్రేషన్​మార్కెట్​వ్యాల్యూస్​కమిటీలు సమావేశమయ్యాయి. రెవెన్యూ, స్టాంప్స్​అండ్​రిజిస్ట్రేషన్, పంచాయత్​రాజ్, మున్సిపల్​శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సమావేశాలు జరిగాయి. సబ్​రిజిస్ట్రార్లు ప్రతిపాదించిన విలువలను దాదాపుగా ఆమోదించినట్లు తెలిసింది. ఈ మేరకు ఒకటీ రెండు రోజుల్లోనే తుది ఉత్తర్వులు రానున్నట్లు అధికారులు చెప్పారు.

జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో నివాస స్థలాల ధరలను 30 నుంచి 50 శాతం వరకు, భవన నిర్మాణాలకు చదరపు అడుగు విస్తీర్ణానికి 20 నుంచి 30 శాతం వరకు పెంచుతున్నారు. ఇక వ్యవసాయ భూములకైతే ప్రచారంలో ఉన్నట్లుగానే 50 నుంచి 150 శాతం వరకు పెంచుతున్నట్లు సమాచారం. అతి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో 300 శాతం వరకు కూడా పెంచినట్లు ఓ రెవెన్యూ అధికారి తెలిపారు. ఉదాహరణకు మారుమూల గ్రామాల్లో ఎకరం మార్కెట్​విలువ ఇప్పటికీ రూ.40 వేలుగా ఉన్నాయి. అలాంటి భూముల ధరలను 300 శాతం వరకు పెంచేందుకు స్టాంప్స్​అండ్​రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలను కమిటీ ముందు ఉంచింది.

అయితే సీఎం కేసీఆర్​ప్రకటించినట్లుగా ఎక్కడైనా ఎకరం రూ.10 లక్షలకు తక్కువగా లేదన్నదే ప్రామాణికంగా తీసుకుంటే ప్రతిపాదనను ఆమోదించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రభుత్వం సవరించిన మార్కెట్​విలువలను ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొచ్చే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. కాగా, ముందుగా ప్రతిపాదిత ధరలకు సంబంధించిన ఉత్తర్వులు మాత్రం ఒకటీ రెండు రోజుల్లోనే రానున్నట్లు తెలిసింది.

రోడ్డు సైడ్​.. కాస్లీ

ఎక్కడైనా సరే.. రోడ్డు సైడ్​ఉండే భూముల ధరలు మాత్రం అమితంగానే పెరగనున్నాయి. అందులోనూ జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదార్ల ప్రాతిపదికన సదరు సర్వే నంబర్లపై ఫోకస్​పెట్టారు. రోడ్డు వెంబడి ఉండే భూములకు, లోపలి వైపు ఉండే భూములకు వేర్వేరుగా ధరలు ఉండనున్నాయి. ఒకటే సర్వే నంబరులోని భూమియైనా.. వాటి సబ్ డివిజన్ల ఆధారంగా ధరలను ఖరారు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఎలాగైతే రోడ్డు సదుపాయం కలిగిన భూములకు ధరలు ఎక్కువగా పలుకుతున్నాయో మార్కెట్​విలువలను అలాగే రూపొందిస్తున్నట్లు తెలిసింది. వ్యవసాయ భూములను కూడా వ్యవసాయేతర భూములుగానే పెంపు ప్రక్రియలో ప్రామాణికతలను పాటించారు. కొన్ని గ్రామాల్లో నేటికీ అతి తక్కువలోనే మార్కెట్​విలువలు ఉన్నాయి.

మారుమూల గ్రామాల్లో ఎకరం రూ.40 వేల నుంచి రూ.80‌‌ వేల వరకు పలికేవే ఎక్కువగా ఉన్నాయి. పెరిగిన భూముల విలువలతో ఎక్కడైనా రూ.లక్షల్లో పలుకుతున్నాయి. ఇదే నేపధ్యంతో మార్కెట్ విలువల పెంపును అమలు చేశారు. అలాగే అత్యంత ఖరీదైన భూములు కలిగిన కోకాపేట, ఖానామెట్​లో మాత్రం పెంపు 30 శాతానికి మించకపోవచ్చు. ప్రస్తుతం ఆ గ్రామాల్లో ఎకరం రూ‌‌.కోటిగా ఉంది. బహిరంగ మార్కెట్, ప్రభుత్వం ఈ వేలం ద్వారా వాటి విలువ రూ.60 కోట్ల వరకు ఉంది. కానీ ఇప్పటికే రూ.కోటి వరకు ఉన్నందున మరో రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు మాత్రమే పెరగొచ్చునని అధికారులు చెబుతున్నారు. మరింతగా పెంచితే కొనుగోలుదార్లపై విఫరీతమైన భారం పడునుంది.

కాసులే కాసులు

వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్​విలువల పెంపు విధానం ద్వారా ఏటా రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం ఖచ్చితంగా రెట్టింపు కానుంది. ఈ నేపధ్యంలో మద్యం అమ్మకాల ద్వారా పొందే ఆదాయంతో రిజిస్ట్రేషన్లతో సమకూరే నిధులు పోటీ పడనున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక సర్కారు ఖజానాకు కాసుల గలగలలేనంటున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed