టీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. హుజురాబాద్‌ బరిలో మరో 120 మంది

by  |
టీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. హుజురాబాద్‌ బరిలో మరో 120 మంది
X

దిశ, వేములవాడ: తమ సమస్యలపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామంటున్నారు మిడ్ మానేరు నిర్వాసితులు. ముంపు గ్రామాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ తీరుపై నిరసనగా వేములవాడ నంది కమాన్ వద్ద నల్ల బ్యాడ్జీలు, నల్ల బెలూన్స్‌తో ధర్నా చేపట్టారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం తాము సర్వస్వం త్యాగం చేశామన్నారు. ఇప్పుడు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తయినా.. నిర్వాసితుల సమస్యలు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయని విమర్శించారు. తమ సమస్యలను పరిష్కారం చేయాలని రెండేళ్ల క్రితం కలెక్టర్ కార్యాలయం వరకు మహా పాదయాత్ర చేపట్టిన ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తంచేశారు. వేములవాడ రాజన్న సాక్షిగా మిడ్ మానేరు నిర్వాసితులకు రూ. 5 లక్షలు ఇస్తామన్న సీఎం హామీ ఏమైందని ప్రశ్నించారు. వెంటనే నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఊరికి 10 మంది చొప్పున 120 మంది పోటీ చేస్తామని హెచ్చరించారు.

Follow Disha daily Official Facebook page :https://www.facebook.com/dishatelugunews


Next Story

Most Viewed