మా వల్ల కాదంటే కాదు.. వ్యాక్సిన్ పేరెత్తితే మమ్మల్నే కొడుతున్నరు

by  |
మా వల్ల కాదంటే కాదు.. వ్యాక్సిన్ పేరెత్తితే మమ్మల్నే కొడుతున్నరు
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో ఇంటింటి వ్యాక్సినేషన్ చేయడం తమతో కాదని జిల్లా ఏఎన్ఎంలు తేల్చి చెప్పారు. మాకు ఇచ్చిన టార్గెట్లను పూర్తి చేయలేమని స్పష్టం చేశారు. గాంధారి మండలం ఉట్నూర్ పీహెచ్ సీ పరిధిలోని పోతంగల్ సబ్‌సెంటర్ పరిధిలో ఏఎన్ఎంగా పని చేస్తున్న సావిత్రిపై రాంపూర్ గడ్డకు చెందిన ఓ గర్భిణీ కుటుంబ సభ్యులు చేసిన దాడిని నిరసిస్తూ గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఎన్ఎంలు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సినేషన్ వేయడం వల్లనే తమ బిడ్డ మరణించాడని ఆరోపిస్తూ ఏఎన్ఎం సావిత్రిపై దాడి చేయడం సరికాదన్నారు.

రాంపూర్ గడ్డకు చెందిన లక్ష్మీ అనే మహిళకు మొదటి కాన్పులో 7 నెలలకే ప్రసవం జరిగిందని, ఆ సమయంలో ఏఎన్ఎం సావిత్రి దగ్గరుండి ప్రసవం చేయించిందన్నారు. ప్రస్తుతం ఆమె రెండవ కాన్పు కూడా 7 నెలలకే పురిటి నొప్పులు రావడంతో గాంధారి సీఎస్సీ నుంచి కామారెడ్డికి, కామారెడ్డి నుంచి నిలోఫర్ ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. ఆస్పత్రిలో పుట్టిన బిడ్డకు గ్యారెంటీ ఇవ్వలేమని వైద్యులు చెప్పిన మాటకు తలఊపి డెలివరీ జరిపించారని, దాంతో పుట్టిన బిడ్డ మృతి చెందిందని తెలిపారు. దానికి సావిత్రి వేసిన వ్యాక్సినే కారణమని చెబుతూ దారిలో కనిపించిన ఏఎన్ఎంపై దాడి చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడం కోసం తమకు టార్గెట్లు విధించిందని, దీనికోసం ఇంటింటి వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టిందన్నారు.

ఇంటింటికీ వ్యాక్సిన్ కోసం వెళ్తున్నపుడు ప్రజలు తమకు సహకరించడం లేదని, ఇష్టారీతిన తిడుతున్నారని వాపోయారు. ఏదైనా జరిగితే తామే బాధ్యులమంటూ దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటి వ్యాక్సిన్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు తమకు ఎలాంటి రక్షణ ఉండటం లేదన్నారు. ఇలాంటి ఘటనలతో మాలో ఆత్మస్తైర్యం దెబ్బతింటుందని, ఇకపై ఇంటింటి వ్యాక్సినేషన్ చేయడం తమ వల్ల కాదని స్పష్టం చేశారు. గ్రామంలో ఒకే చోట కూర్చుని వచ్చిన వారికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తామని తెలిపారు. గ్రామంలో సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకోని వారికి ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ది చెందకుండా గ్రామాల్లోని అధికారులు, ప్రజాప్రతినిధులకు సర్క్యులర్ జారీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అప్పుడే వందశాతం వ్యాక్సిన్ విజయవంతం అవుతుందని తెలిపారు. ఇప్పుడు జరిగిన దాడితో మరిన్ని గ్రామాల్లో ఇలాంటి ఘటనలు పునరావృత్తం అయ్యే అవకాశం ఉందని, ప్రభుత్వం తమకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.

Next Story

Most Viewed