Kadapa: బద్వేలు తెలుగు తమ్ములకు నారా లోకేష్ క్లాస్?

by Disha Web Desk 16 |
Kadapa: బద్వేలు తెలుగు తమ్ములకు నారా లోకేష్ క్లాస్?
X

దిశ, కడప ప్రతినిధి: బద్వేలు నేతలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్లాస్ తీసుకున్నారు. పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గ అభ్యర్థిని గెలిపిస్తేనే పార్టీ ఆఫీసు మెట్లెక్కాలని ఒకింత సీరియస్‌గా మాట్లాడినట్లు సమాచారం. పార్టీ పటిష్టత, నేతల పని తీరుపై ప్రత్యేక దృష్టితో ఉన్న లోకేష్ కడప జిల్లాలో నేతల వ్యవహార శైలి, పార్టీ కోసం స్పందించే తీరు, తదితర అంశాలపై క్షుణంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. జిల్లాలో పాదయాత్ర ముగింపు రోజు అయిన మంగళవారం బద్వేలు నేతలతో సమావేశం అయ్యారు. మండలాల వారిగా పార్టీపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన బద్వేలు నేతల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాట్లాడినట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో బద్వేల్ స్థానం కచ్చితంగా గెలవాలని, అక్కడి ముఖ్య నేతలకు గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇక్కడ గెలిస్తేనే రాష్ట్ర పార్టీగా ఆఫీసుకు వచ్చే అవకాశం ఉంటుందని గట్టిగా చెప్పినట్లు పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం

సన్మానం మీకే చేస్తా

లోకేష్ బద్వేలి నియోజకవర్గం నేతలతో మాట్లాడే క్రమంలో కొందరు ఆయనకు సన్మానం చేసేందుకు వెళ్లారు. అయితే ఆయన అందుకు నిరాకరించారు. సన్మానం తనకు చేయడం కాదని, తన చుట్టూ తిరగడం కాదని, జనంలోకి వెళ్ళాలని, జనంతో ఉండాలని, ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులను గెలిపించంచాలని సూచించారట. ఆ తర్వాత తానే సన్మానం చేస్తానని లోకేశ్ చురక అంటించినట్లు తెలుస్తోంది. బద్వేలులో పార్టీ ప్రతిసారీ ఓటమి పాలు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారు. ఇకమీదట పార్టీని పటిష్టం చేసి జనం మధ్యలో ఉంటూ వచ్చే ఎన్నికల నాటికి బద్వేల్లో తెలుగుదేశం జెండా ఎగిరే విధంగా కష్టపడాలని వారికి దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

మీ పాస్ పోర్ట్‌లు ఇవ్వండి..

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పార్టీ నేతల పని తీరును చిన్న పెద్దా అన్న తేడా లేకుండా అందరిని గమనిస్తూ వస్తున్నట్లు చెప్పుకోవచ్చు. కడప జిల్లాలోని ఇద్దరు ప్రముఖ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘మీ పాస్పోర్ట్ లు నాకు ఇచ్చేసేయండి. మీరు జిల్లాలో తిరగండి’ అంటూ చురక వేసినట్లు తెలుస్తోంది. విదేశాల్లో తిరగడం కాదని, తెలుగుదేశం పార్టీ కోసం ఇక్కడ కష్టపడి తిరగండని అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడినట్లు సమాచారం. నాయకులు ఎవరైనా సరే కష్టపడి పని చేస్తేనే పార్టీలో ప్రాధాన్యం ఉంటుందన్న హెచ్చరికలు లోకేశ్ చేసినట్లుగా కూడా చెప్పుకోవచ్చు.

Next Story