టీడీపీలోకి మంచు మనోజ్?: వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచే పోటీ

by Disha Web Desk 21 |
టీడీపీలోకి మంచు మనోజ్?: వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచే పోటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : సినీనటుడు మంచు మనోజ్ రాజకీయారంగేట్రం చేయబోతున్నారా?రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న మంచు మనోజ్‌కు సరైన సమయం రానే వచ్చిందా..? రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతలున్నా భూమ ఇంటి అల్లుడు అవ్వడం ఆయనకు కలిసి వస్తుందనే రాజకీయాలవైపు అడుగులు వేయబోతున్నారా? భూమా కుటుంబానికి టీడీపీ అధినేత చంద్రబాబుకు సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో మంచు మనోజ్ టీడీపీలో చేరి పోటీ చేస్తారా? అంటే అవునే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. తెలుగుదేశం పార్టీలో చేరడానికి మంచు మనోజ్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మంచు మనోజ్ టీడీపీలో చేరితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు? అనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.

వైసీపీకి దూరంగా మంచు ఫ్యామిలీ

మంచు మనోజ్ ప్రస్తుతం సినిమాల్లో బిజీబిజీగా ఉన్నారు. గతంలో ప్రజా సేవ చేయాలనే ఆలోచనతో కొన్నాళ్లు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. మళ్లీ సినిమాలవైపు చూస్తున్నారు. ప్రస్తుతం మనోజ్ నటిస్తున్న సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి దంపతుల ద్వితీయ కుమార్తె మౌనిక రెడ్డిని మంచు మనోజ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మౌనికరెడ్డి రాజకీయాలవైపు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులోనూ మంచు మనోజ్‌కు సైతం రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉంది. ఈ నేపథ్యంలో మౌనిక రెడ్డి, మంచు మనోజ్ ఇద్దరూ రాజకీయ ఆరంగేట్రం చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి మంచు ఫ్యామిలీ వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటుంది. వైఎస్ఆర్ కుటుంబానికి మంచు విష్ణువర్థన్ రెడ్డి అల్లుడు కావడంతో గత ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేశారు. మంచు మోహన్ బాబు, మంచు విష్ణులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం వైఎస్ జగన్‌తో విభేదించి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు మంచు మోహన్ బాబు అయితే ఇక ఏపీ రాజకీయాలకు రాను అని దండం పెట్టేశారు. తనకు ప్రధాని నరేంద్రమోడీ అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. మోడీ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తే ఆలోచిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

చంద్రబాబుతో భేటీ అనంతరం క్లారిటీ

మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్న భూమా మౌనిక రెడ్డి కుటుంబం టీడీపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలో భూమా మౌనిక రెడ్డి సోదరి భూమా అఖిలప్రియ ఏకంగా మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ఎక్కడా తగ్గడం లేదు. టీడీపీలో చాలా యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషిస్తోన్నారు. ఇదే తరుణంలో భూమా మౌనిక రెడ్డి సైతం టీడీపీ వైపే ఉంటారనే ప్రచారం జరుగుతుంది.ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్, భూమా మౌనికరెడ్డిలు సోమవారం సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో చంద్రబాబును కలుసుకోనున్నారు. ఇందుకు సంబంధించి అపాయింట్మెంట్ సైతం ఖరారు అయినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే చంద్రబాబు సమక్షంలోనే మంచు మనోజ్, మౌనిక రెడ్డిలు టీడీపీ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగుతుంది.

అఖిలప్రియ సీటుకు ఎసరు

తెలుగుదేశం పార్టీలోకి మంచు మనోజ్ దంపతులు చేరితో వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. భూమా అఖిలప్రియపై నియోజకవర్గంలో అసంతృప్తి ఉందనే ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డితో భూమా అఖిలప్రియకు పొసగడం లేదు. భూమా అఖిల ప్రియ బరిలోకి దిగితే ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె సైతం తాను బరిలోకి దిగుతానని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో భూమా అఖిల ప్రియ బరిలోకి దిగితే ఫలితం ప్రతికూలంగా వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మంచు మనోజ్ లేదా మౌనిక రెడ్డిని బరిలోకి దించితే మంచిదనే అభిప్రాయం వెల్లడవుతుంది. మౌనిక రెడ్డిని ఏవీ సుబ్బారెడ్డి ఆమోదిస్తారనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. మౌనిక రెడ్డి పట్ల ఏవీ సుబ్బారెడ్డి సదాభిప్రాయం ఉందని కర్నూలు పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా చర్చ జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఆళ్లగడ్డలో అఖిల ప్రియకు బదులుగా మంచు మనోజ్‌లేదా మౌనిక రెడ్డిని బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. మెుత్తానికి ఈ పరిణామాలు చూస్తుంటే భూమా అఖిల ప్రియకు కాస్త ఇబ్బందేనని తెలుస్తోంది. మంచు మనోజ్ దంపతుల పొలిటికల్ ఎంట్రీ భూమా అఖిలప్రియ సీటుకు ఎసరు తెస్తుందని ప్రచారం జరుగుతుంది. అసలు భూమా ఫ్యామిలీ రాజకీయం మనోజ్ ఎంట్రీతో ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి Hyd: చంద్రబాబుతో భేటీ... మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు



Next Story

Most Viewed