ఇన్పోసిస్ ఆఫీస్ పెడితే కోడిగుడ్డు మంత్రికి, జగన్‌కు సంబంధం ఏమిటి?: నాదెండ్ల మనోహర్

by Disha Web Desk 21 |
ఇన్పోసిస్ ఆఫీస్ పెడితే కోడిగుడ్డు మంత్రికి, జగన్‌కు సంబంధం ఏమిటి?: నాదెండ్ల మనోహర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాఫ్ నాలెడ్జ్ పర్సన్ అని ఆయనతో రాష్ట్రానికి అపారనష్టం తప్ప మేలు జరగదని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోవడానికి ప్రధాన కారణం వైఎస్ జగన్ కారణం అని అన్నారు. ముఖ్యమంత్రి అమరావతి నుంచి కాకుండా విశాఖ నుంచి పాలనకు సిద్ధమైతే రాజధాని పేరుతో ఈ ప్రాంత ప్రజలను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుదేలయ్యాయని ఆరోపించారు. వైసీపీ పాలనలో రైతాంగం చితికిపోయిందని, వారికి అండగా నిలబడటం కోసం తెలుగుదేశం పార్టీతో కలిసి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. గుంటూరు జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రికి పట్టుంటే సరైన ప్రణాళికలతో రైతులకు న్యాయం చేసేవారు. ఆయనకు శాఖపై పట్టు లేకపోవడంతో రైతులు రోడ్డునపడ్డారు. వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోయారని నాదెండ్ల మనోహర్ అన్నారు.


కోడిగుడ్డు మంత్రి హడావిడెందుకు?

విశాఖలో ఇన్ఫోసిస్ కార్యాలయం ప్రారంభం అయితే ప్రభుత్వం నానా హడావిడి చేస్తోందని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ముఖ్యమంత్రి, కోడి గుడ్డు మంత్రికి ఇన్ఫోసిస్ కార్యాలయంతో సంబంధం ఏంటి? అని నిలదీశారు. ఉత్తరాంధ్రలో ఉన్న ఇన్ఫోసిస్ ఉద్యోగులు వారంలో రెండు రోజులైనా ఆఫీసుకు వచ్చి పని చేసుకునేందుకు వీలుగా ఇన్ఫోసిస్ కార్యాలయం నిర్మాణం చేసిందని చెప్పుకొచ్చారు. 250 నుంచి 300 మంది వరకు వచ్చి పని చేసుకునేలా కార్యాలయం నిర్మించింది. అదేదో ముఖ్యమంత్రి చొరవ వల్ల ఇన్ఫోసిస్ రాష్ట్రానికి వచ్చినట్లు వైసీపీ నాయకులు బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు. ఇన్ఫోసిస్ సంస్థ ఉత్తరాంధ్రకు చెందిన తమ ఉద్యోగుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కార్యాలయం అని దానికి వైసీపీ ఎందుకు హడావిడి చేస్తోందని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏర్పాటు ద్వారా రూ.13 లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నట్లు వైసీపీ ప్రభుత్వం చెప్పిందని.. అందులో ఏ ఒక్క కంపెనీ వచ్చి కార్యాలయం ఏర్పాటు చేస్తే తాము స్వాగతించే వాళ్లమని అన్నారు. అలా కాకుండా ఇన్ఫోసిస్ మీరే తీసుకొచ్చినట్లు ఇంత తతంగం ఎందుకు? అని నిలదీశారు. వైసీపీ నాయకులకు సరైన ప్రణాళిక లేకపోవడం, విద్యుత్ ఛార్జీలు ఇష్టమొచ్చినట్లు పెంచడంతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయి. వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.



Next Story

Most Viewed